అపార్ట్‌మెంట్ బాల్కానీలో పశువుల పెంపకం, ఫిర్యాదుల వెల్లువ!

చైనాలో ఓ రైతు తాను నివసిస్తోన్న అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు బాల్కానీలో ఏడు ఆవులను పెంచుతున్నాడు.

By Srikanth Gundamalla  Published on  24 July 2023 6:38 AM GMT
Cattle rearing, apartment balcony, Complaints, China,

 అపార్ట్‌మెంట్ బాల్కానీలో పశువుల పెంపకం, ఫిర్యాదుల వెల్లువ!

అపార్ట్‌మెంట్లలో ఉండేవారు ఎక్కువగా పూల చెట్లు.. లేదంటే సువాసన వచ్చే మొక్కలను పెంచుకుంటారు. కొందరైతే గ్రీనరీ కోసం అంటూ వివిధ రకాల మొక్కలను పెంచుకుంటారు. జంతువుల విషయానికి వస్తే పెంపుడు కుక్కలు, పిల్లులను ఉంచుకుంటారు. కానీ.. ఓ వ్యక్తి తన ఆపార్ట్‌మెంట్‌ బాల్కానీని పశువుల పాకగా మార్చేశాడు. బాల్కానీలోనే ఉంచి వాటికి గడ్డి, నీళ్లను అందిస్తున్నాడు. ప్రస్తుతం బాల్కానీలో పశువుల పెంపకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ రైతు తాను నివసిస్తోన్న అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు బాల్కానీలో ఏడు ఆవులను పెంచుతున్నాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత పశువుల పేడ, అరుపులను ఇరుగు పొరుగువారు భరించలేకపోయారు. సదురు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువులను అపార్ట్‌మెంట్‌ నుంచి తీసుకెళ్లాలని చెప్పారు. కానీ అతను వినలేదు. ఇంకా కొద్ది రోజులకు పేడ వాసన పక్క బిల్డింగ్‌ల వరకూ చేరింది. దాంతో ఫిర్యాదులు మరింత ఎక్కువయ్యాయి. చివరకు అధికారులు స్పందించారు. రైతు నివసిస్తోన్న అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లారు.

అధికారులు కూడా ఆవులను అపార్ట్‌మెంట్‌ నుంచి తరలించారని చెప్పారు. దాంతో సదురు రైతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారు గ్రామాల్లో నివసించే వారమని.. పునరావాసం పేరుతో ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పాడు. అందుకే తమతో పాటే పశుసంపదను అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చామని చెప్పాడు. ఉన్నట్లుండి మా పశువులను ఎక్కడికి తీసుకెళ్లమంటారని ఎదురు ప్రశ్నించాడు రైతు. దాంతో అధికారులు ఏం చెప్పాలో తెలియక మూగబోయారు. పశువులను మాత్రమే కాదు.. పునరావాసం కింద అపార్ట్‌మెంట్‌కు వచ్చిన ఇంకొందరు రైతులు తమతో పాటే కోళ్లు, గొర్రెలను కూడా ఉంచుకుంటున్నారు. కోళ్లను పెంచుతున్నప్పుడు తాను పశువులను పెంచడంలో తప్పేంటని రైతు ప్రశ్నించాడు. అయినా అధికారులు మాత్రం పశువులను అపార్ట్‌మెంట్‌లో ఉంచడం సరికాదని.. తరలించాలని సూచించారు.

కాగా గ్రామీణ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నవారిని పునరావాసం పేరుతో ఇటీవల అపార్ట్‌మెంటులోకి తరలించారు. అదే ఈ సమస్యకు కారణమైంది. వారిలో కొందరు కోళ్లు కూడా పెంచుతున్నట్లు అపార్ట్‌మెంటువాసులు చెబుతున్నారు. అపార్ట్ మెంట్ బాల్కనీలో ఏడు ఆవులు గడ్డి మేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అధికారులు చెప్పినా కూడా రైతు వినడం లేదు.. చివరకు ఏం చేశారనేది తెలియాల్సి ఉంది.

Next Story