పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చిన వరుడు.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న వధువు
Bride marries another man at wedding venue after groom fails to reach on time.సమయపాలన అనేది చాలా ముఖ్యం.
By తోట వంశీ కుమార్
సమయపాలన అనేది చాలా ముఖ్యం. అన్ని సందర్భాల్లో సమయపాలన పాటించాల్సిన అవసరం లేదు కానీ.. కొన్నింటి విషయాల్లో సమయపాలన తప్పక పాటించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఫ్రెండ్స్‌తో తప్పతాగి కళ్యాణ మండపానికి ఆలస్యంగా వచ్చిన వరుడికి వధువు దిమ్మ తిరిగే షాకిచ్చింది. మూహూర్త సమయానికి రాకపోవడంతో వధువు తండ్రి ఆమెను వేరొకరికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మల్కాపూర్ పంగ్రా గ్రామంలో ఏప్రిల్ 22న సాయంత్రం నాలుగు గంటలకు ఓ యువతి, యువకుడికి పెళ్లి చేసేందుకు మూహూర్తాన్ని నిశ్చయించారు ఇరు కుటుంబాల పెద్దలు. అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. కళ్యాణ మండపానికి చేరుకున్న వధువు, ఆమె కుటుంబ సభ్యులు వరుడి కోసం వేచి చూస్తున్నారు. ముహూర్త సమయం దాటి గంట, రెండు గంటలైనప్పటికీ వరుడు రాలేదు. చివరకు నాలుగు గంటల ఆలస్యంగా అంటే రాత్రి 8 గంటలకు కళ్యాణ మండపం వద్దకు వచ్చాడు.
అప్పటికే బాగా మద్యం సేవించిన వరుడు డ్యాన్స్ చేస్తూ మండపానికి రావటాన్ని చూసిన వధువు తండ్రికి చిర్రెత్తుకొచ్చింది. అతడికి తన కుమారైను ఇచ్చి పెళ్లి చేసేందుకు వధువు తండ్రి ఇష్టపడలేదు. పెళ్లికి వచ్చిన తన బంధువుల్లోని ఓ అబ్బాయికి ఇచ్చి కుమారైకు వివాహం చేశాడు. దెబ్బకు వరుడికి మద్యం మత్తు దిగిపోయింది.
దీనిపై వధువు తండ్రి మాట్లాడుతూ.. వరుడి తరుపు వారు డ్యాన్స్‌తో బిజీగా ఉన్నారు. వరుడు, తన స్నేహితులతో కలిసి మందు తాగాడు. ముహూర్తం సాయంత్రం 4 గంటలకు అయితే.. రాత్రి 8 గంటలకు వచ్చాడు. అంతేకాకుండా గొడవకు దిగాడు. దీంతో మా అమ్మాయిని బంధువుల అబ్బాయికి ఇచ్చి వివాహం చేసాం అని చెప్పారు. కాగా..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.