గురువారం పెళ్లి.. శుక్రవారం షాపింగ్.. డబ్బుతో పెళ్లి కూతురు పరార్
Bride cheats husband and ran away.నలబై ఏళ్ల బ్రహ్మచారి ఎన్నోఆశలతో పెళ్లి చేసుకున్నాడు. అయితే.. రెండు రోజుల్లోనే
By తోట వంశీ కుమార్ Published on 21 Dec 2021 7:06 AM GMTనలబై ఏళ్ల బ్రహ్మచారి ఎన్నోఆశలతో పెళ్లి చేసుకున్నాడు. అయితే.. రెండు రోజుల్లోనే అతడి ఆశలు ఆడియాశలయ్యాయి.పెళ్లి కుమారై అతడిని దారుణంగా మోసం చేసింది. అత్తగారింటికి వచ్చిన కొత్తపెళ్లి కూతురు.. ఇంట్లోని నగదుతో పరారైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. యాచారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎన్ని సంబంధాలు వచ్చినా దాట వేస్తూ వచ్చాడు. ప్రస్తుతం అతడికి 40 ఏళ్లు వచ్చాయి. ఈ వయసులో అతడు పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. మిత్రుడి సాయంతో ఓ మధ్యవర్తిని కలిశాడు. అమ్మాయిని చూడాలంటూ ఆ మధ్యవర్తికి లక్ష రూపాయలు కూడా ఇచ్చాడు. సదరు మధ్యవర్తి విజయవాడలో ఓ అమ్మాయి ఉందని చెప్పాడు. అయితే.. ఆ అమ్మాయికి ముందు వెనుకా ఎవరూ లేరని చెప్పాడు. అతడిని అక్కడికి తీసుకెళ్లాడు.
ఆ అమ్మాయి నచ్చడంతో గురువారం ఓ లాడ్జిలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం భార్యతో కలిసి శుక్రవారం యాదగిరి గుట్టకు వచ్చి వత్రం చేశారు. అనంతరం హైదరాబాద్‌లో షాపింగ్ చేశారు. రూ.40వేల విలువ చేసే దుస్తులు, మూడు తులాల బంగారం గొలుసు కొనుగోలు చేసి రాత్రికి బాధితుడి స్వగ్రామం యాచారం చేరుకున్నారు. బీరువాలో బట్టలు సర్దుతున్నట్లు నటించిన కొత్త పెళ్లికూతురు.. బీరువాలోని రూ.2లక్షల నగదు, బట్టలను తన బ్యాగులో సర్దుకుంది. కొత్త పెళ్లికూతురితో పాటు వచ్చిన మరో యువతి.. తన సోదరుడిని చూసేందుకు వెళ్లాలి అని చెప్పి ఓ కారును మాట్లాడి ఉంచింది. తరువాత కొత్త పెళ్లి కూతురు తనకు తలనొప్పిగా ఉందని చెప్పి భర్తను మెడికల్ షాపుకు పంపించింది.
అతడు బయటకు వెళ్లగానే.. కారులో మహిళలిద్దరూ ఉడాయించారు. కారులోనే ఆ ఇద్దరూ బట్టలు మార్చుకోవడం చూసి.. అనుమానంతో కారు డ్రైవర్ వారిని ప్రశ్నించగా.. అతడిని బెదిరించారు. ఎల్బీనగర్ వద్ద కారు దిగి.. విజయవాడకు వెళ్లిపోయారు. కొత్త పెళ్లి కూతురు డబ్బు, నగలు, దుస్తులతో పరారైన విషయం తెలిసిన బాధితుడు.. సోమవారం స్థానిక పెద్దలకు చెప్పి బోరుమనడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక అందరూ కలిసి మధ్యవర్తిని నిలదీయగా.. ఆమె ఇంత పనిచేస్తుందని ఊహించలేదని, తనకు ఏ పాపం తెలియని అతడు వాపోయాడు. ఇదంతా ఓ ముఠా పనిగా అనుమానిస్తున్నారు.