ఇటీవల కొంత మంది చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి దానికి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అది పోలీసులు తీర్చే సమస్యా.. కాదా..? అన్నది కూడా పట్టించుకోవడం లేదు. చేను కనబడడం లేదు, రోడ్డు పోయిందని కంప్లైట్ ఇవ్వడం మనం చూశాం. తాజాగా ఓ రైతు తన నాలుగు ఆవులు పాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాలోని భద్రావతి తాలూకాలోని హళెహోన్నూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సిద్లిపురా గ్రామానికి చెందిన ఓ రైతు తన నాలుగు ఆవులకు మేత అందిస్తున్నప్పటికీ గత నాలుగు రోజులుగా పాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ వాటిపై హళెహోన్నూరు పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మళ్లీ సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు నాలుగు ఆవులకు మేత కోసం వ్యవసాయ పొలాలకు తీసుకెలుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కాగా.. గత నాలుగు రోజులుగా ఆవులు పాలు ఇవ్వడం లేదు. కాబట్టి పోలీసులు తప్పకుండా పాలు ఇచ్చేలా ఆవులను ఒప్పించాలని అందులో పేర్కొన్నాడు. ఆ ఫిర్యాదును చూసిన పోలీసులు నివ్వెరపోయారు. ఇలాంటి కేసులు నమోదు చేయలేమని.. అతడికి నచ్చజెప్పి పంపించారు. కాగా.. ప్రస్తుతం ఈ ఫిర్యాదు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. పశువుల వైద్యుడికి చూపించమని కామెంట్లు పెడుతున్నారు.