నెలకు రూ.6వేలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరుతున్న బట్టతల బాధితులు
Bald men seek pension in Siddipet District.మాకు కూడా ఫించన్లు కావాలని అంటున్నారు బట్టతల బాధితులు.
By తోట వంశీ కుమార్ Published on 7 Jan 2023 3:41 PM ISTసాధారణంగా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం ఫించన్లు అందిస్తుంటుంది. అయితే.. మాకు కూడా ఫించన్లు కావాలని అంటున్నారు బట్టతల బాధితులు. అవును మీరు చదివింది నిజమే. బట్టతల ఉన్నవారికి కూడా వెంటనే ఫించన్ ఇవ్వాలని, వీలైతే సంక్రాంతి కానుకగా ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని బట్టతల బాధితులు కోరుతున్నారు. నెలకు రూ.6వేలు ఇస్తే చాలా సంతోషిస్తామని అంటున్నారు. ఎక్కడో విదేశాల్లోనో, లేక ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు దీన్ని కోరడం లేదు. మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన వారు ఈ విధమైన కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు.
జనవరి 5న కోహెడ మండలంలోని తంగళ్లపల్లి గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ గుడి ఆవరణలో బట్టతల బాధితుల సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా వెల్ది బాలయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా రాజేశం, కోశాధికారిగా మౌటం రాము ఎన్నికయ్యారు. అనంతరం సంఘం తొలి అధ్యక్షడు బాలయ్య మాట్లాడుతూ.. బట్టతల వల్ల సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
తమను మానసిక వికలాంగుల కింద పరిగణించి నెలకు రూ.6వేల ఫించన్ అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. సంక్రాంతి లోపు ఫించన్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అలాకానీ పక్షంలో సంక్రాంతి తరువాత బట్టతల బాధితుల జిల్లా సంఘాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. అవసరం అయితే ప్రగతి భవన్‌ను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు.
"ప్రజలు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. వారు మాట్లాడే మాటలు మమ్మల్ని బాధతలకు గురి చేస్తున్నాయి. దీని కారణంగా మేము మానసికంగా ఎంతో వేదనను అనుభవిస్తున్నాం. "అని గ్రూప్ సభ్యుల్లో ఒకరైన అంజి తెలిపారు. పట్టభద్రుడైన అంజి ఇద్దరు పిల్లలకు తండ్రి కూడా.
గ్రూపు సభ్యుల్లో కొందరికి 22 ఏళ్లే అయినప్పటికి వారికి దాదాపు పూర్తిగా బట్టతల వచ్చిందని అంజి చెప్పాడు. ఫించన్ వస్తే ఏం చేస్తారని అడుగగా.. సాధ్యమైయితే ఆ డబ్బులతో బట్టతలపై వెంట్రుకలు వచ్చే విధంగా ట్రీట్‌మెంట్ చేయించుకుంటామని చెప్పారు. ఫించన్‌ను ట్రీట్‌మెంట్ ఖర్చుల కింద పరిగణించాలని అన్నాడు.
బట్టతల.. చాలా మందిని వేధిస్తున్న సమస్య. మహిళలతో పోలిస్తే ఈ సమస్య పురుషుల్లో అధికంగా ఉంటుంది. కారణాలు ఏవైనప్పటికీ పురుషుల్లో దాదాపు 30 నుంచి 50 శాతం మంది బట్టతలతో బాధపడుతున్నారు. తినే తిండి వల్లో, జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్లో కారణం ఏదైనప్పటికీ ఇటీవల యువకుల్లో కూడా బట్టతల బాధితులు పెరుగుతున్నారు. జట్టు ఊడిపోతుండడంతో నలుగురిలో అందవిహీనంగా కనబడతామన్న ఇనిఫీరియార్టీ కాంప్లెక్స్ మొదలవుతుంది. ఈ సమస్య మెల్లగా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తుందని వీరు అంటున్నారు.
అందుకనే ఓ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఫించన్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. మరీ ప్రభుత్వం వీళ్ల డిమాండ్‌ను పట్టించుకుంటుందో లేదో చూడాలి.