తమిళనాడులోని అటవీ ప్రాంతంలో దారి తప్పిన ఓ ఏనుగు పిల్లను తిరిగి దాని తల్లి దగ్గరకు చేర్చారు అక్కడి అటవీ శాఖ సిబ్బంది. నీలగిరి పర్వతాలలోని ముదుమలై నేషనల్‌ పార్క్‌లో ఒక ఏనుగు పిల్ల దారి తప్పి గోయ్యిలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన అటవీశాఖ సిబ్బంది.. వెంటనే ఏనుగు పిల్లను గొయ్యి నుండి బయటకు తీసి రక్షించారు. ఏనుగుకు ప్రథమ చికిత్స చేసి దాని తల్లి దగ్గరకు చేర్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఏనుగు పిల్లను దాని తల్లి దగ్గరికి పంపించేందుకు సిబ్బంది దారి చూపిస్తుంటే.. ఎంచక్కా వారిని అనుసరిస్తూ కుట్టి ఏనుగు అడుగులు వేసింది. చివరికి కొంత దూరం వెళ్లిన తర్వాత తల్లి ఏనుగు కనబడడంతో.. ఆనందంతో ఘీంకారిస్తూ తల్లి ఏనుగు ఉన్న మందకు చేరింది. ఈ వీడియోను తమిళనాడు పర్యావరణ, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుప్రియా సాహు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఏనుగు పిల్లను రక్షించిన అటవీ శాఖ అధికారులు సిబ్బంది సచిన్, వెంకటేష్ ప్రభు, ప్రసాద్, విజయ్, జార్జ్, ప్రవీన్‌సన్‌, తంబ కుమార్, అనీష్, కుమార్, పండలూరు ఏపీడబ్ల్యూ బృందాలకు ఆమె అభినందనలు తెలిపారు. ఇది నిజంగా చాలా హృదయపూర్వకమైందంటూ ఆమె అన్నారు.

ముదమలై నేషనల్‌ పార్క్‌లో వన్యప్రాణులతో పాటు పులుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. ఇది కోయంబత్తూరు నుండి 150 కిలోమీటర్ల దూరంలో వాయువ్య నీలగిరి కొండలపై ఉంది. కర్నాటక, కేరళ రాష్ట్రాలతో ఈ నేషనల్‌ పార్క్‌ సరిహద్దులను పంచుకుంటోంది. ఈ రక్షిత నేషనల్ పార్క్‌లో అంతరించి పోతున్న వన్యప్రాణులతో పాటు భారతీయ ఏనుగు, బెంగాల్‌ పులి, చిరుతపులులు ఉన్నాయి.


అంజి

Next Story