వింత ఘటన.. 12 సెం.మీ తోకతో పుట్టిన బాలుడు
Baby born with 12 cm long human tail in Brazil.ఇలా తోకతో శిశువులు పుట్టడం అరుదైన విషయమని, ఇప్పటివరకు ఇలాంటివి
By తోట వంశీ కుమార్ Published on 7 Nov 2021 8:02 AM ISTమానవుడు కోతి నుంచి వచ్చాడని అంటారు. కోతి నుంచి మానవుడిగా మారే క్రమంలో తోక ఉండేదని.. కాలక్రమంలో పూర్తి మానవుడిగా మారాడని చెబుతుంటారు. అయితే.. దీనిలో ఎంత నిజం ఉందో తెలీదు కానీ.. బ్రెజిల్‌లో మాత్రం ఓ వింత ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన పిల్లవాడిని చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. కాసేపటి వరకు తాము చూస్తుంది నిజమేనా అన్న అనుమానం వారిలో కలిగింది. 12 సెం.మీ తోకతో బాలుడు జన్మించడమే అందుకు కారణం.
వివరాల్లోకి వెళితే.. ఫోర్టాలెజా నగరంలోని ఆల్బర్ట్ సాబిన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో 35 వారాల గర్భిణీ పురుటినొప్పులతో చేరింది. ఆస్పత్రిలో ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే.. ఆ శిశువుకు తోక ఉండడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆ తోక 12 సెం.మీ పొడవు ఉండగా.. తోక చివరగా.. ఓ బంతి ఆకారం ఉంది. కాగా.. మహిళ గర్భం దాల్చిన తరువాత ఆస్పత్రిలో తరచూ పరీక్షలు చేయించుకున్నప్పటికీ.. తోక ఆనవాళ్లు ఎప్పుడూ బయట పడలేదని వైద్యులు తెలిపారు.
అయితే.. ఆ తోకకు నాడీ వ్యవస్థకు ఎలాంటి సంబంధం లేదని.. కేవలం చర్మానికి మాత్రమే తోక పెరిగిందన్నారు. దీంతో శస్త్రచికిత్స ద్వారా తోకను తొలగించినట్లు చెప్పారు. కాగా.. దీన్ని నిజమైన మానవ తోకగా వారు అభివర్ణించారు. తోకతో శిశువు జన్మించడం అత్యంత అరుదు అని.. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు 40 వరకు నమోదు అయ్యాయని చెబుతున్నారు. ఏదీ ఏమైనప్పటికి శిశువు తోకతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.