చెప్పులు వేసుకుని నడిస్తే.. రూ.4లక్షల జీతం.. త్వరపడండి
Athletics Company crazy offer.ఓ కంపెనీ తమ సంస్థకు చెందిన చెప్పులు వేసుకుని టెస్ట్ చేస్తే ఏకంగా నాలుగు లక్షల జీతం ఇస్తామని ప్రకటించింది.
By తోట వంశీ కుమార్ Published on 31 Jan 2021 5:41 PM IST
కరోనా మహమ్మారి లాక్‌డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలు పోయాయి. వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రావడంతో ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటోంది. ఖాళీగా ఏం చేయకుండా ఇంట్లో కూర్చొని ఏడాదికి రూ.4లక్షలు సంపాదిస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అబ్బా ఉరికే ఎవరు ఇస్తారని అంటున్నారా..? ఓ కంపెనీ తమ సంస్థకు చెందిన చెప్పులు వేసుకుని టెస్ట్ చేస్తే ఏకంగా నాలుగు లక్షల జీతం ఇస్తామని ప్రకటించింది. అది రోజు పనిచేయాల్సిన అవసరం లేదు. నెలలో రెండు రోజులపాటు వర్క్ చేస్తే చాలట.
యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన 'బెడ్‌రూం అథ్లెటిక్స్' అనే సంస్థ ఇంట్లో వేసుకునే కంఫర్డ్ చెప్పులు, సోఫా షీట్లు, బెడ్‌షీట్లు, డోర్ మ్యాట్లు తయారు చేస్తుంటుంది. కొత్త ఏడాదిలో స్లిప్పర్ టెస్టర్‌ను నియమించుకోవాలని నిర్ణయించింది. ఆ సంస్థకు చెందిన పాదరక్షల్ని రోజుకు 12గంటల పాటు ధరిస్తే చాలు ఏడాదికి సుమారు రూ. 4 లక్షల వరకూ జీతాన్ని అందిస్తామని తాజాగా ప్రకటించింది. ఈ మేరకు తమ వెబ్‌సైట్‌లో ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగం చేసేవారు చేయాల్సిందల్లా సంస్థ పాదరక్షల్ని రోజుకు 12గంటల పాటు ధరించి వారికి సమీక్ష చెప్పడమే.
పనితీరు బాగుంటే జీతంతో పాటు 12జతల చెప్పుల్ని కూడా ఉచితంగా ఇస్తారండోయ్! అయితే వచ్చిన చిక్కల్లా.. రెండు ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. వాటిల్లోనూ ఒకటి పురుషుడికి, ఒకటి మహిళకు ఇస్తారు. ఇందుకోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://www.bedroomathletics.com/ లో దరఖాస్తు చేసుకోమని తెలిపింది. అయితే ఈ దరఖాస్తు చేసుకునే క్రమంలో తాము ఆ ఉద్యోగానికి ఎందుకు సూట్ అవుతామన్న విషయాన్ని వివరంగా తెలపాల్సి ఉంటుంది. ఎవరు అయితే మంచి వివరణ ఇస్తారో వారికే ఆ ఉద్యోగం దక్కనుంది. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు దరఖాస్తు చేసుకోండి.