ఫీజు అవసరం లేదు.. ఆ స్కూల్‌లో ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే చాలు..
అస్సాంలో అక్షర్ స్కూల్ ఒకటి ఉంది. ఈ స్కూల్‌లో ఫీజు కింద ప్లాస్టిక్ బాటిల్స్‌ను తీసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 4:30 PM ISTఫీజు అవసరం లేదు.. ఆ స్కూల్‌లో ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తే చాలు..
మంచి ప్రయివేట్ స్కూల్‌లో చదివించాలంటే ఫీజులు భారీగానే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ బడులను అటు ఉంచితే.. ప్రయివేట్ స్కూళ్లలో డొనేషన్లు, అడ్మిషన్లు సహా ఇతరత్రా వాటి కోసం అంటే మనీ లాగేస్తుంటారు. నర్సరీ నుంచే తల్లిదండ్రుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. అయితే.. ఈ స్కూల్ మాత్రం వాటన్నింటికీ విభిన్నం. ప్రభుత్వ పాఠశాల కాదు.. కానీ.. ఇక్కడ ఫీజు కట్టనవసరం లేదు. జస్ట్ వారికి ప్లాస్టిక్ వ్యర్థాలను ఇస్తే సరిపోతుంది. అదే వారి ఫీజు అట. వినడానికే వింతగా ఉన్నా ఇది నిజమే. అస్సాంలో ఉన్న ఈ స్కూల్ ఇప్పుడు పాపులర్ అయిపోతుంది. ఫీజు కింద ప్లాస్టిక్‌ను తీసుకోవడం వెనుక మంచి కారణం లేకపోలేదు.
అస్సాంలోని పామోహి ప్రాంతంలో ఉంది అక్షర స్కూల్. దీన్ని పరిమిత శర్మ, మజిన్ ముఖ్తార్ అనే దంపతులు 2016లో స్థాపించారు. ఆ ప్రాంతంలో రెండు సమస్యలను గుర్తించిన ఈ దంపతులు.. వాటికి పరిష్కార మార్గం ఎంచుకున్నారు. అక్కడ ఎక్కువ మంది క్వారీల్లో పనిచేసే వారు ఉన్నారు. వీరికి బడి ఫీజులు చెల్లించడం చాలా కష్టమయ్యేది. పిల్లల్నిచదువుకోవడానికి పంపేవారు కాదు. దాంతో నిరక్ష్యరాస్యత పెరిగిపోయింది. మరో పక్క ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండటం చూశారు. వీటిని గమనించిన ఈ దంపతులు మంచి ఆలోచన చేశారు. రెండింటికీ ఒకేసారి చెక్ పెట్టేలా వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
పిల్లలను చదివించేందుకు ఒక స్కూల్ పెట్టారు. ఆ తర్వాత తమకు ఫీజు అవసరం లేదని.. ప్రతి వారం విద్యార్థులు 25 ప్లాస్టిక్ బాటిళ్లను తీసుకురావాలని చెప్పారు. అదే తమ ఫీజుగా పరిగణిస్తామంటూ కండీషన్ పెట్టారు. అయితే.. పరిమిత శర్మ, మజిన్ ముఖ్తార్ ఆలోచనను మెచ్చిన స్థానికులు కూడా పిల్లలను స్కూల్‌కు పంపుతున్నారు. పిల్లలు తీసకొచ్చే ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేస్తున్నారు. అంతేకాదు సీనియర్ విద్యార్థులు.. చిన్నపిల్లలకు పాఠాలు నేర్పడం.. డబ్బు సంపాదించడం వంటివి నేర్పుతున్నారు. నైతిక విలువలతో పాటు విద్యార్థులకు చెత్త రీ సైక్లింగ్, గార్డెనింగ్ మొదలైనవి బోధిస్తున్నారు. ఈ అక్షర స్కూల్ ఆర్థికంగా వందల మంది విద్యార్థులకు మంచి విద్యను అందిస్తోంది. అలాగే.. గ్రామస్తులు కూడా ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా దుష్ప్రయోజనాలను తెలుసుకుంటున్నారు. వారు కూడా రీసైక్లింగ్ డ్రైవ్‌లో పాల్గొంటున్నారు.
నాగాలాండ్ ఉన్నత విద్యాశాఖ మంత్రి టెమ్‌జెన్ ఈ స్కూల్ గురించి ట్విట్టర్‌లో వీడియో పోస్టు చేశారు. అది చూసిన నెటిజన్లు మంచి ఆలోచన అంటూ ఆ దంపతులను పొగుడుతున్నారు.
If this doesn't surprise you, what does?#Incredible_NorthEastCredit: northeastview_ pic.twitter.com/6RO1SqhaNa
— Temjen Imna Along (@AlongImna) October 12, 2023