గోదారోళ్ల మర్యాదలు.. కొత్త అల్లుడికి 379 వంటకాలతో విందు
Andhra Pradesh family serves son in law 379 food items.కొత్త అల్లుడు ఇంటికి వస్తే చేసే మర్యాదలు చాలా బాగుంటాయి.
By తోట వంశీ కుమార్ Published on 17 Jan 2023 5:08 AM GMTతెలుగు రాష్ట్రాల్లో కొత్త అల్లుడు ఇంటికి వస్తే చేసే మర్యాదలు చాలా బాగుంటాయి. అల్లుడు ఇది కావాలని అడగకముందే అన్ని సిద్దం చేస్తుంటారు. ఇక గోదారోళ్ల సంగతి చెప్పేదేముంది. మర్యాదలకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాలకు అల్లుడు కావాలని ఇప్పుడు చాలా మంది యువకులు కోరుకుంటున్నారు. ఈ సంక్రాంతి ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్లకి గోదారోళ్లు పోటాపోటీగా మర్యాదలు చేస్తున్నారు.
మొన్న ఓ దంపతులు 173 వంటకాలు సిద్దం చేయగా.. ఇప్పుడు ఇంకొకరు ఏకంగా 379 వంటకాలు కొత్త అల్లుడి కోసం సిద్దం చేసి ఔరా అనిపించారు. డైనింగ్ టేబుల్ నిండా ఎక్కడా చిన్న ఖాళీ లేకుండా వంటకాలతో నింపేశారు. ఆ వంటకాలను చూసి అదేదో సినిమాలో బ్రహ్మనందం చెప్పినట్లుగా ఇంత ఎవరైనా తింటారా సార్.. మీరు కూడా తినలేరు అనే డైలాగ్ చెప్పే పరిస్థితిలా తయారైంది ఆ కొత్త అల్లుడి పరిస్థితి.
ఏలూరు నగరం దొంగల మండపానికి చెందిన భీమారావు, చంద్రలీల దంపతులు తమ కుమార్తెను అనకాపల్లికి చెందిన మురళీకి ఇచ్చి గతేడాది ఏప్రిల్‌లో వివాహం జరిపించారు. వీరి వివాహం తరువాత తొలి సంక్రాంతి కావడంతో అల్లుడు, కూతురు ఇంటికి రావడంతో వారు జీవితంలో మరిచిపోలేని విధంగా ఏర్పాట్లు చేయాలని బావించారు. అనుకున్నట్లుగానే పిండివంటలు, కూరలు, వేపుళ్లు, స్వీట్లు, పండ్లు, కూల్ డ్రింక్స్, పచ్చళ్లు ఇలా 379 రకాల వంటకాలను కొత్త అల్లుడి కోసం సిద్దం చేశారు.
వాటి అన్నింటినీ డైనింగ్ టేబుల్ పై పెట్టి అల్లుడు, కూతురిని భోజనానికి పిలిచారు. ఇంకేముంది అన్ని వంటకాలను ఒకేసారి చూసి ఆ అల్లుడు షాకైయ్యాడు. కూతురు, అల్లుడికి ఆ దంపతులు ఇద్దరూ కలిసి కొసరి కొసరి తినిపించారు.
దీనిపై భీమారావు మాట్లాడుతూ.. సంస్కృతి, సంప్రదాయాలకు గోదావరి జిల్లాలు నిలయం. ఇక్కడి అతిథి మర్యాదలను వైభవంగా చాటాలనే ఉద్దేశంతోనే ఇన్ని రకాల వంటకాలను సిద్ధం చేయించినట్లు చెప్పారు.
అంతకుముందు.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన వ్యాపార వేత్త తటవర్తి బద్రి, సంధ్య దంపతులు తమ అల్లుడికి 173 రకాల వంటకాలు చేసి వడ్డించిన సంగతి తెలిసిందే.