ప్రస్తుతం ఏం కావాలన్నా.. ఇంట్లో కూర్చోనే ఆర్డర్ ఇవ్వొచ్చు. అమెజాన్, ప్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్ వచ్చాక.. అన్నీ ఆన్‌లైన్‌లోనే దొరుకుతున్నాయి. బయటకు వెళ్లాల్సిన పనీలేదు. గతకొంతకాలంగా ఆవుపేడతో చేసిన పిడకలు అమెజాన్‌లో అమ్ముతున్నారు. కౌ డంగ్ కేక్ పేరుతో వీటిని అమ్ముతున్నారు. ఓ వ్యక్తి వాటిని ఆర్డర్ చేశాడు. అయితే.. వాటిని కేకులని అనుకున్నాడో.. ఏమనుకున్నాడో తెలీదు కానీ.. వాటిని తిన్నాడు. అంతేకాదు.. అవి అంతగా రుచీగా లేవని.. తయారీలో మరింత జాగ్రత్త వహించాలని.. అవి తిన్నాక తనకు మోషన్లు పట్టుకున్నట్లు రివ్యూ ఇచ్చాడు. ప్రస్తుతం అతడు ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
డాక్టర్ సంజయ్ అరోరా అనే ట్విట్టర్ యూజర్.. అమెజాన్‌లో పిడకలు కొని రుచి చూసిన వ్యక్తి రివ్యూను పోస్ట్ చేశాడు. 'దీన్ని నేను తిన్నాను. టేస్ట్ అస్సలు బాగోలేదు. దీని రుచి గడ్డి-బురద కలిసినట్లుగా ఉంది. ఇది తిన్న తర్వాత నాకు జిగట విరోచనాలు పట్టుకున్నాయి. దయచేసి తీని తయారీ సమయంలో పరిశుభ్రత విధానాలు పాటించండి. అంతేగాక దీని రుచి మీద కూడా దృష్టి పెట్టండి' అని రివ్యూలో పేర్కొన్నాడు.
విదేశాల్లో ఉండే భారతీయ కోసం అమెజాన్ వీటిని విక్రయిస్తోంది. ఆ ప్రొడక్ట్ కింద వీటిని కేవలం దేవుడి పూజ కోసమే వినియోగించాలని చాలా స్పష్టంగా రాసి ఉంది. మరీ సదరు కస్టమర్ అది చదివాడో లేదో తెలీదు..గానీ వాటి రుచీ చూసి షాకయ్యాడు. ఈ సందర్భంగా ఆ ఉత్పత్తికి ఒక స్టార్ వేయడమే కాకుండా నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ రివ్యూ పై నెటీజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నిజంగానే తిన్నడా..? అని ఒకరు కామెంట్ చేయగా.. సరదా కోసమే ఇలా చేసి ఉంటాడు అని మరొకరు కామెంట్ చేశారు.