ఒక వ‌స్తువును అనేక ర‌కాలుగా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఆలోచ‌న ఉండాలే కానీ పనికిరాని వ‌స్తువు అంటూ ఈ ప్ర‌పంచంలో ఏదీ ఉండ‌దూ. ఉప‌యోగించుకునే విధానం తెలియాలంతే. త‌న పంట పొలానికి న‌ర‌దృష్టి త‌గ‌ల‌కుండా ఓ రైత‌న్న చేసిన ఐడియా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మామూలుగా పొలాల్లో దిష్టిబొమ్మ‌లు పెడుతుండ‌డం చూస్తూనే ఉంటాం. కానీ ఈ రైత‌న్న ఏకంగా టాలీవుడ్ హీరోయిన్ల‌ను దిష్టిబొమ్మ‌లుగా మార్చేశాడు.వివరాళ్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేటలోని చంద్రమౌళి అనే రైతు తనకున్న రెండకరాల్లో మిర్చి సాగు చేసి తీవ్రంగా న‌ష్ట‌పోయాడు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే స‌మ‌యానికి ఏదో ఒక తెగులు ప‌ట్టి పాడ‌వుతోంది. ఇలా రెండు మూడు సంవ‌త్స‌రాల నుంచి న‌ష్ట‌పోతూనే ఉన్నాడు. కాపు బాగా వ‌చ్చినా న‌ర‌దిష్టి త‌గ‌ల‌డం వల్లే చివ‌ర్లో పంట చేతికంద‌డం లేద‌ని చంద్ర‌మౌళి బావించాడు.

తన పొలంపై నుంచి మ‌నిషుల దృష్టి మ‌ర‌ల్చేందుకు వినూత్నంగా ఆలోచించాడు. దిష్టి బొమ్మలకు బదులుగా హాట్ బ్యూటీ కాజల్, మిల్కీ బ్యూటీ తమన్నాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. ఇలా చేయ‌డం వ‌ల్ల హీరోయిన్లను చూసిన వారి దృష్టి తన పంటపై పడదు, దిష్టి తగలదు అనేది అత‌డి ఆలోచ‌న‌. అనుకున్న‌ట్లుగానే.. హీరోయిన్స్ ఫొటోలు అందంగా, ఆకర్శణీయంగా ఉండడంతో బాటసారుల చూపంతా వాటిపైనే పడింది. ఈ సారి పంట బాగా పండి మంచి గిట్టుబాటు వ‌చ్చేలా ఉంద‌ని, ఎలాంటి తెగులు సోక‌లేద‌ని రైతు చంద్ర‌మౌళి తెలిపాడు. ఈ విషయం తెలిసినవాళ్లు ఐడియా అదిరింది గురూ అంటూ సదరు రైతన్నను అభినందిస్తున్నారు


తోట‌ వంశీ కుమార్‌

Next Story