ఓ యువకుడు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొద్ది మంది అతడు చేసిన పనికి ఫిదా అవుతుండగా.. చాలా మందిని భయపెడుతోంది. ఇంతకు అతడు ఏం చేశాడంటే.. తన అంకుల్ అస్థిపంజరంతో గిటార్ తయారు చేశాడు. ఆ గిటారుతో అద్భుతమైన సంగీతాన్ని ప్లే చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. యూఎస్‌కు చెందిన ప్రిన్స్ మిడ్‌నైట్ అనే యువకుడికి తన అంకుల్ ఫిలిఫ్ అంటే చాలా ఇష్టం. అయితే.. కొన్నేళ్ల క్రితం అతడు చనిపోయాడు. ఫిలిప్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఓ మెడికల్ కాలేజీకి ఇచ్చారు.
ఆ మృతదేహంపై కాలేజీ విద్యార్థులు పరిశోధనలు చేశారు. చివరికి ఆ డెడ్‌బాడీ బాగా కుళ్లిన స్థితికి చేరింది. దీంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకే.. మెడికల్ కాలేజీ తిరిగి ఇచ్చింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. కానీ అంకుల్‌పై ప్రేమతో ప్రిన్స్ మిడ్‌నైట్ మాత్రం తన అంకుల్ ఆత్మకు సరికొత్తగా శాంతి చేకూర్చాలని వెరైటీగా ఆలోచించాడు. పిలిఫ్ అస్థిపంజరంతో గిటారును రూపొందించాడు. సాధారణ గిటార్ మాదిరిగానే ఆ అస్థిపంజరాన్ని మార్చి అందరిని విస్మయానికి గురి చేశాడు. ఎలక్ట్రానిక్ గిటార్ మాదిరిగానే దాన్ని రూపకల్పన చేసిన ప్రిన్స్ మిడ్‌నైట్ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఈ అస్థిపంజరం గిటారు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ గిటార్ నుంచి వచ్చే మ్యూజిక్ అందరినీ అలరిస్తోంది.