దోమల బెడద ఎక్కువగా ఉండే దేశాల్లో మన దేశం కూడా ఒకటి. దోమలు కుట్టడం ద్వారా అనేక వ్యాధులు వస్తాయి. కొన్ని సార్లు ప్రాణాంతకం కూడా కావచ్చు. ఓ సర్వే ప్రకారం మన దేశంలో సగటున ప్రతి సంవత్సరం 5లక్షల మంది దోమకాటు వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక ఇంట్లో దోమల బారినుంచి తప్పించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రయత్నిస్తుంటారు. దోమ తెరలు, జెట్ కాయిల్స్ వంటివి ఉపయోగిస్తుంటారు. ఒక్కోసారి మనల్ని దోమలు కుట్టినప్పుడు వాటిని చంపుతుంటాం.. తరువాత వాటిని ఏం చేస్తాం..? ఆ చెత్త కుప్పలోనే, బయటనో, నలిపి కింద పడేస్తాం. అయితే.. ఓ యువతి మాత్రం దోమలను చంపడమే పనిగా పెట్టుకుంది. తాను ఎన్ని దోమలను చంపానో తెలుసుకునేందుకు ఆ చంపిన దోమల్ని ఓ నోట్‌బుక్‌లో అతికించి మరీ దాచుకుంటుంది.
ఢిల్లీకి చెందిన ఈ యువతి పేరు శ్రేయా మహోపాత్ర. డెంగ్యూ బారిన పడిన తరువాత నుంచి శ్రేయా దోమలను చంపడమే పనిగా పెట్టుకుంది. గత రెండు సంవత్సరాల నుంచి దోమలను చేతులతో చంపడం లేదా మస్కిటో బ్యాట్ తో చంపడం అలవాటుగా చేసుకుంది. దోమలు కుట్టడం ద్వారా పనిపై ఏకాగ్రత కుదిరేది కాదని. అందుకే దోమలను చంపుతున్నానని శ్రేయా చెబుతున్నారు. తనను కుట్టకముందే దోమలను చంపేయాలని అనుకున్నానని.. నోట్ బుక్ పై నంబర్లు వేసి అతికించడం ద్వారా ఎన్ని దోమలను చంపానో గుర్తు ఉంటుందని ఆమె అన్నారు.
ఈ విషయం ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా తెలీదు. ఆ యువతీ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసినప్పుడే వారికి ఈ విషయం తెలిసింది. శ్రేయా చేసిన ఈ పని వల్ల ఆమె సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరింది.