పెళ్లి కుమార్తెకు తులం బంగారం..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Nov 2019 10:45 AM ISTఅసోం ప్రభుత్వం సంచలన పథకాన్ని ప్రవేశపెట్టింది. బాల్య వివాహాలను ఆపేందుకు, బాలికల విద్యను మరింతగా ప్రోత్సహించేందుకు కాస్త వినూత్నంగా ఆలోచించింది. రాష్ట్రంలో పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయికు 10 గ్రాముల బంగారం కానుకగా అందించే కొత్త పథకానికి శ్రీకారం చుట్టుంది. అరుంధతి బంగారు పథకం అన్నఈ పథకాన్ని బుధవారం అనౌన్స్ చేయడంతో పాటు విధివిధానాలు కూడా వెల్లడించింది. అయితే బంగారాన్ని డైరెక్ట్‌గా ఇవ్వకుండా.. రూ. 30 వేల నగదును ప్రభుత్వం వధువు అకౌంట్‌లో డిపాజిట్ చేయనుంది.
ఇకపై ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో..అప్పుడు ఉన్న బంగారం ఖరీదును బట్టి..పథకం ద్వారా ఇచ్చే నగదులో కాస్త మార్పులు ఉంటాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నట్లు అసోం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ తెలిపారు. అయితే ఈ పథకానికి కొన్ని అర్హతలు ఉండాలి. అవి వధూ వరులకు కనీస వివాహా వయస్సు 18, 21ఏళ్లు ఉండాలి. వధువు కనీసం 10వ తరగతి వరకు చదువుకొని ఉండాలి. వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయించాలి. వధువు యొక్క వార్షిక కుటుంబ ఆదాయం 5 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలి.