పాఠశాలలో క్షుద్రపూజలు.. దెయ్యాలు వస్తున్నాయంటూ..
By అంజి Published on 11 Jan 2020 3:16 PM ISTవరంగల్ అర్బన్: ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి దెయ్యాలు వస్తున్నాయని ఓ పాఠశాల హెచ్‌ఎం కుద్రపూజలు చేయించిన ఘటన వరంగల్ జిల్లాలో కలకలం రేపుతోంది. విద్యార్థులు సరిగా పాఠశాలకు రావడం లేదని, తన ఆరోగ్యం బాగుండడం లేదని మూఢ నమ్మకాలతో ఓ ప్రధానోపాధ్యాయురాలు భూత వైద్యుడితో క్షుద్రపూజలు చేయించింది. కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామంలోని పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. దీంతో పాఠశాల విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రధానోపాధ్యాయురాలు గత నాలుగు రోజుల నుంచి పాఠశాలకు రావడం లేదు.
శుక్రవారం నాడు కారులో ఓ భూత వైద్యుడిని తీసుకువచ్చి పూజలు చేయించినట్లు పాఠశాల ఆవరణలో ఆనవాళ్లు కనిపించాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్షుద్రపూజలు చేసిన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. భూతవైద్యుడిని, ప్రధానోపాధ్యాయురాలును అదుపులోకి తీసుకొని విచారిస్తామని, తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇలాంటి క్షుద్రపూజలను ఎవరు నమ్మవద్దని పోలీసులు అక్కడి స్థానికులకు తెలిపారు. గొప్ప గొప్ప చదువులు చదివిన కొందరికి మూఢ నమ్మకాల విషయంలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. టెక్నాలజీ యుగంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మన దురదృష్టకరం.