చిన్నారితో ఒబామా ( వైరల్ )
By Newsmeter.Network Published on 24 Dec 2019 10:47 AM ISTబరాక్ ఒబామా... అమెరికా మాజీ అధ్యక్షుడు అయితేనేం ఇప్పటికీ ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో, ప్రశాంతగా దర్శనమిస్తుంటాడు. పదవిని కోల్పోయిన తర్వాత కూడా ఆయన్ను అభిమానించే వారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. అమెరికాలోనే కాదు పలుదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. అలానే ఆయనలో అమెరికా అధ్యక్షుడిగా చేసిన గర్వం ఏ మాత్రం లేదు. ఎక్కడికి వెళ్లినా సాదాసీదాగా వెళుతుంటారు. చక్కగా తన పని తాను చేసుకుంటూ పోతారు. తాజాగా ఒబామా హవాయి రాష్ట్రంలోని కనైలిలో ‘కనేహే క్లిప్పర్ గోల్ఫ్ కోర్సు’కు వెళ్లారు. ఆ సమయంలో ఓ తల్లి తన చిన్నారిని ఎత్తుకుని అదే గోల్ఫ్ కోర్సులో ఆడిస్తోంది. ఆ బిడ్డను చూసిన ఒబామా ముచ్చటేసి ఆమెను పలకరించారు. ‘ఎవరీ పాప?’ అంటూ చిన్నారి రిలేను ఆమె తల్లి దగ్గరనుంచి తన చేతుల్లోకి తీసుకున్నాడు.
ఈ పాపకు ఎన్ని సంవత్సరాలని ఒబామా అడగగా పాపాయి తల్లి మూడు నెలలని సమాధానమిచ్చింది. ఆ తర్వాత శిశువును ముద్దు చేస్తూ ఆడిస్తూ ‘నేను నీకు పాలివ్వలేను’ అంటూ పాపాయితో జోక్ చేశాడు. అనంతరం ఆమె నుదుటిపై ప్రేమగా ఓ ముద్దు పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ అనూహ్య చర్యతో పాపాయి తల్లి టిఫానీ ఉక్కిరిబిక్కిరైపోయింది. మాజీ అధ్యక్షుడిలా కాకుండా సాదాసీదాగా వచ్చి, సామన్యుడిలానే పలకరించి వెళ్లిపోయాడని ఆ తల్లి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. ఇది క్షణాల్లో వైరల్ గా మారింది. దాదాపుగా పదిలక్షల మంది ఈ సన్నివేశాన్ని వీక్షించారు. మనలో ఒకరిగా ఉండటం వల్లే ఒబామాను ప్రేమిస్తున్నామని కొందరు, మానవత్వం ఉన్న వ్యక్తి అని ప్రశంసిస్తూ ఇంకొందరు ఈ వీడియోను రీట్వీట్ చేశారు.