నూజివీడులో దారుణం.. అర్థరాత్రి బాలికపై అఘాయిత్యం

By Newsmeter.Network  Published on  27 Feb 2020 6:28 AM GMT
నూజివీడులో దారుణం.. అర్థరాత్రి బాలికపై అఘాయిత్యం

తండ్రి ఇంకా ఇంటికి రాలేదని.. తండ్రి కోసం రోడ్డు పైకి వచ్చి ఎదురు చూస్తుంది కూతురు. నాన్న ఎక్కడ ఉన్నాడో తెలుసునని.. తనతో వస్తే చూపిస్తానని చెప్పిన ఓ ఆగంతకుడు.. ఆ బాలికను తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేషుబాబు తన కుటుంబంతో కలిసి నూజివీడు పట్టణంలోని గాంధీనగర్‌లో నివసిస్తున్నాడు. తాపీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా బుధవారం రాత్రి 9.30గంటల వరకు ఇంటికి రాలేదు. ఆ సమయంలో శేషుబాబు కుమారై.. మూడవ తరగతి చదువుతున్న బాలిక తండ్రి కోసం రోడ్డుపైకి వచ్చింది. అటుగా వెలుతున్న ఓ ఆగంతకుడు ఆ బాలికపై కన్నేశాడు. బాలిక తండ్రి ఎక్కడ ఉన్నాడో తనకు తెలుసునని, తనతో వస్తే తండ్రి దగ్గరికి తీసుకువెళతానని చెప్పాడు. ఆగంతకుడి మాటలు నమ్మిన ఆ చిన్నారి.. అతనితో వెళ్లింది. సైకిల్ పై బాలికను త్రిపుల్‌ ఐటీకి సమీపంలో తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం బాలికను అక్కడే వదిలేసి పరారయ్యాడు. నొప్పిని భరించలేక బాలిక కేకలు వేసింది.

కాగా.. పెట్రోలింగ్‌లో ఉన్న నూజివీడు సీఐ పి.రామచంద్రారావు.. బాలిక కేకలు విని అక్కడికి వెళ్లాడు. బాలికను ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story