అనకాపల్లి సబ్‌జైలుకు నూతన్‌నాయుడు
By తోట వంశీ కుమార్ Published on 6 Sep 2020 9:06 AM GMTరాష్ట్రంలో సంచలనం సృష్టించిన దళిత యువకుడు శిరోముండనం కేసులో సినీ నిర్మాత, బిగ్‌బాస్ ఫేమ్ నూతన్‌నాయుడుని కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి రైల్వే స్టేషన్‌లో గురువారం రాత్రి నూతన్‌నాయుడిని అరెస్ట్ చేసిన పోలీసులు శుక్రవారం ఉడిపి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం శనివారం అర్థరాత్రి విశాఖ తీసుకొచ్చిన పోలీసులు కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆదివారం నూతన్‌నాయుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా.. అతడికి ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నూతన్ నాయుడిని అనకాపల్లి సబ్‌జైలుకి తరలించారు. ఈ కేసులో ఇప్పటికే నూతన్ నాయుడు భార్య మధుప్రియ, ఇంటి సహాయకురాలు వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఉడిపిలో అతడు అరెస్టయి 24 గంటలు గడవకముందే గాజువాక పీఎస్‌లో మరో కేసు నూతన్ నాయుడిపై నమోదైంది. గతంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతుండగా గాజువాక పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో నూతన్‌నాయుడు తాను మాజీ ఐఏఎస్ అధికారినని, అరెస్టయిన వ్యక్తిని వదిలేయమని గాజువాక సీఐకి ఫోన్ చేశాడు. అతడు ట్రాఫిక్ సీఐకి కాల్ ట్రాన్స్‌ఫర్ చేయగా అది సీఎంఓ ఆఫీస్ నెంబర్ కాదనేసరికి ఫోన్ కట్ చేసేశారు. దీనిపై గాజువాక పోలీసులు నూతన్‌నాయుడిపై కేసు నమోదు చేశారు.