ఎన్టీఆర్-త్రివిక్రమ్.. వెరీ బిగ్ ఆన్ ద వే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sep 2020 12:44 AM GMT
ఎన్టీఆర్-త్రివిక్రమ్.. వెరీ బిగ్ ఆన్ ద వే

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగిపోయిందో తెలిసిందే. అప్పట్నుంచి అతడి ప్రతి కొత్త సినిమా మీదా విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. వాటి రేంజ్ కూడా మామూలుగా ఉండట్లేదు. ‘సాహో’ సంగతే తీసుకుంటే రూ.300 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిందా సినిమా. దానిపై విడుదలకు ముందు ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో.. ఎంత హైప్ వచ్చిందో తెలిసిందే.

రాజమౌళి తర్వాతి సినిమా ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల రేంజ్ కూడా ఇలాగే పెరుగుతుందని అంచనా వేస్తున్నారు వారి అభిమానులు. దీని తర్వాత తారక్, చరణ్ సినిమాల బడ్జెట్లు, వాటి కథలు, మేకింగ్ స్థాయి అంతా భారీ స్థాయిలో ఉంటుందనడంలో సందేహం లేదు. చరణ్ తర్వాతి ప్రాజెక్టు ఏదన్నది ఖరారు కాలేదు కానీ.. తారక్ మాత్రం త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్‌ సినిమాలను లైన్లో పెట్టాడు.

త్రివిక్రమ్-తారక్ సినిమా గురించి ఈ ఏడాది ఆరంభంలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తిన’కు అనే టైటిల్ కూడా ప్రచారంలోకి రావడం.. దీని బడ్జెట్ రూ.150-200 కోట్ల మధ్య ఉంటుందని వార్తలొచ్చాయి. కానీ అవేవీ అధికారికంగా ఖరారవ్వలేదు. ఐతే సోషల్ మీడియాలో మాత్రం తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి తెగ చర్చించుకుంటున్నారు. దీని అప్‌డేట్ల కోసం నిర్మాణ సంస్థను ట్యాగ్ చేసి అడుగుతున్నారు.

ఈ నేపథ్యంలో ‘హారిక హాసిని’ సంస్థలో నిర్మాణ భాగస్వామి, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ స్పందించాడు. సినిమా షూటింగ్ మొదలయ్యాకే అన్ని అప్ డేట్లూ ఇస్తామని.. అంతకంటే ముందు టైటిల్ ప్రకటించమని, అది తమకు సెంటిమెంట్ అని.. కాబట్టి అప్పటిదాకా ఆగాలని కోరాడు. ఐతే ఈ ప్రాజెక్టు అయితే చాలా పెద్ద స్థాయిలోనే ఉంటుందనే సంకేతాలు ఇస్తూ ‘వెరీ వెరీ బిగ్ ఆన్ ద వే’ అని ట్వీట్ చేసి తారక్ అభిమానుల్లో ఉత్సాహం నింపాడు వంశీ.

Next Story