వీఐపీలకు కేంద్రం షాక్.. ఎన్‌ఎస్‌జీ భద్రత తొలగింపు
By Newsmeter.Network
ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులకు రక్షణ కల్పిస్తున్న బ్లాక్ క్యాట్‌లను తొలగించాలని కేంద్రహోంశాఖ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు సహా 13 మందికి ఎన్‌ఎస్‌జీ భద్రత ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దాదాపు 130 మంది ప్రముఖులకు ఎన్ఎస్‌జీ భద్రత కల్పిస్తోంది. కాగా తర్వలో ఈ బాధ్యతలను పారామిలటరీ దళాలు స్వీకరించనున్నాయి. దేశం తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నల్లటి దుస్తులు, అధునాతన ఆయుధాలు డేగ చూపులతో ప్రముఖుల వెనుక ఉండే బ్లాక్ కమాండోలను కేంద్రం వెనక్కి తీసుకోనుంది. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ దళ కమాండోలు ప్రముఖులకు రక్షణ కల్పిస్తున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గాంధీ కుటుంబానికి ఎన్‌పీజీ, మరో 350 మంది ప్రముఖులకు ఇప్పటికే కేంద్రం భద్రతను ఉపసంహరించింది. 13 మంది వీఐపీల భద్రతను జాతీయ భద్రత దళాలే చూసుకుంటు వస్తున్నాయి.
ఒక్కో ప్రముఖుడికి దాదాపు 25 మంది ఎన్‌ఎస్‌జీ సిబ్బంది రక్షణ కల్పిస్తున్నారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం శర్వానంద సోనోవాల్, మాజీ సీఎంలు చంద్రబాబు, మాయవతి ములాయంసింగ్, ప్రకాశ్ సింగ్ బాదల్, ఫరూక్ అబ్దుల్లా, బీజేపీ సీనియర్ లీడర్ ఎల్.కె. అద్వాణీతో పాటు పలువురు ప్రముఖులకు ఎన్‌ఎస్‌జీ రక్షణ కల్పిస్తోంది. ప్రముఖులకు దాదాపుగా 450 ఎన్‌ఎస్‌జీ కమాండోలు రక్షణ కల్పిస్తున్నారు. 1984లో ఎన్‌ఎస్‌జీని ఉగ్రవాద, హైజాక్ నిరోధక ఆపరేషన్ల కోసం ఏర్పాటు చేశారు. భద్రత అనే అంశం ఎన్‌ఎస్‌జీలో లేదని పలువురు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే భద్రత అంశాన్ని పూర్తిగా వదిలి, ప్రధాన విధులపైనే దృష్టి సారించాలన్నదే కేంద్ర ప్రభుత్వ అభిప్రాయమని అధికార వర్గాలు తెలిపాయి.
చంద్రబాబుకు 2003 నుంచి ఎన్‌ఎస్‌జీ భద్రతను కేంద్రప్రభుత్వం కల్పించింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు భద్రత విషయంలో పెద్ద వివాదం జరిగింది. తన భద్రతను సీఎం జగన్ కావాలనే తగ్గించారంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు. అయితే తెలియాల్సిన విషయం ఏంటంటే.. 24 గంటల పాటు చంద్రబాబు చుట్టూ ఇంటెలిజెన్స్, రాష్ట్ర పోలీసులు సుమారు 90 మంది ఉంటారు. వారితో పాటు బ్లాక్ క్యాట్స్ భద్రత కూడా ఉంది. అయిన కూడా తన భద్రతా సిబ్బందిని తగ్గించారంటూ అప్పట్లో చంద్రబాబు గోల చేశారు.