NPRపై ఏపీలో స్టే తేవాలి.!

By అంజి  Published on  2 March 2020 4:50 AM GMT
NPRపై ఏపీలో స్టే తేవాలి.!

ముఖ్యాంశాలు

  • వైఎస్సార్‌ బతికుంటే 2 నిమిషాల్లో ఎన్పీఆర్‌పై స్టే తెచ్చేవారన్న అసద్‌
  • వైఎస్‌ కన్నా మంచి పేరు సీఎం జగన్‌ సాధించాలి: అసదుద్దీన్‌
  • వైసీపీ ప్రభుత్వం ఎన్పీఆర్‌ను అమలు చేస్తే ఉద్యమిస్తాం: అసదుద్దీన్‌

అమరావతి: ఎన్పీఆర్‌పై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్టే తీసుకు రావాలని ఎమ్‌ఐఎమ్‌ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కన్నా వైఎస్‌ జగన్‌ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాని అసద్‌ అన్నారు. వైఎస్సార్‌ బతికి ఉంటే రెండు నిమిషాల్లో ఎన్పీఆర్‌ స్టే తెచ్చేవారని వ్యాఖ్యానించారు. గుంటూరులో జరిగిన యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటి సింహగర్జన సభలో ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ మాట్లాడారు. సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా ఈ సభ జరిగింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎన్పీఆర్‌ను అమలు చేస్తే ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఢిల్లీలో అల్లర్ల ఫొటోలను ఐసిస్‌ వాడుకుంటుందోన్న అసద్‌.. భారత్‌లో ముస్లింపై దాడులు జరుగుతున్నాయంటూ ప్రచారం చేస్తోందని ఆందోనళ వ్యక్తం చేశారు.

ఢిల్లీలో కుట్ర పూరితంగా అల్లర్లు జరిగాయని, దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని అసద్‌ ప్రశ్నించారు. భారత్‌లో ముస్లింలు ఒంటరిగా మిగిలిపోయారని అన్నారు. ఢిల్లీ పోలీసులపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసద్‌ డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి గౌరవంతో చెబుతున్నామని.. రాష్ట్రంలో ఎన్పీఆర్‌ ప్రక్రియను అమలు చేయకూడదని అసదుఉ అన్నారు. ఎన్పీఆర్‌పై స్టే తెచ్చి పేదలను రక్షించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీ పేదలు ఓటు వేస్తేనే గెలిచిందని, ధనికులు ఓటు వేయలేదని అసదుద్దీన్‌ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడిప్పుడే ఈశాన్య ఢిల్లీలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. కాగా ఢిల్లీ హింసాత్మక ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరింది. అల్లర్లు జరిగిన ప్రాంతంలో మరో ఐదు మృతదేహాలను వెలికితీశారు. ప్రజలు భయాందోళన వీడి రోడ్లపైకి వస్తున్నారు. ఇప్పటికే 167 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు పోలీసులు. మరో 800 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Next Story