టాలీవుడ్ స్టార్ పాయల్ రాజ్ పుత్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో తళుక్కుమంది. ముఖ్యంగా ఆమె చేతిలో ఉన్నదాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకూ అదేమిటంటే.. ఆ కుక్కపిల్ల. అవును ఆమె తన పెంపుడు కుక్కను చేతుల్లోకి తీసుకుని ఢిల్లీకి విమానం ఎక్కింది. క్యాండీ(తన కుక్క) అంటే ఎంతో ఇష్టమని.. అది లేకుండా ఉండలేకపోతున్నానని చెప్పుకొచ్చింది. క్యాండీ వయసు ఒకనెల.. పొంచి(పొమేరియన్-చిహువావా మిక్స్డ్ బ్రీడ్) జాతికి చెందిన కుక్కపిల్ల. సాధారణంగా అతి తక్కువ మంది ఇలా కుక్కపిల్లలను తీసుకుని విమానం ఎక్కుతారని.. ముఖ్యంగా ఇలా కుక్కపిల్లలతో విమానం ఎక్కాలంటే.. అది ‘పెట్ ఫ్రెండ్లీ ఎయిర్లైన్స్’ అయి ఉండాలని పాయల్ రాజ్ పుత్ చెబుతోంది.

పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ చాలా విమానాలు పెట్ ఫ్రెండ్లీ విమానాలనీ, కొన్ని జాతులకు చెందిన కుక్కలను మాత్రమే విమానాల్లో తీసుకుని వెళ్ళడానికి అనుమతించరని ఆమె అంటోంది. మనకు తెలిసినంత వరకూ ఓ క్లారిటీ ఉంటే విమానాల్లో కుక్కలను తీసుకొని వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతోంది. నేను ఎప్పుడూ నా పెంపుడు జంతువులతో ప్రయాణిస్తూ ఉంటాను.. కానీ అందుకు చేయవల్సినదల్లా కాస్త పేపర్ వర్క్ మాత్రమేనని అంటోంది పాయల్. ప్రస్తుతం కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతూ ఉండడంతో పెంపుడు జంతువులకు కూడా కాస్త ఎక్కువ టెస్టులు చేస్తున్నారని చెబుతోంది పాయల్. డైరెక్ట్ గా తాను క్యాండీని లోపలి తీసుకుని వెళ్ళలేకపోయానని.. ఎయిర్ పోర్టు అధికారులు పెట్ గైడ్ లైన్స్ ప్రకారం క్యాండీకి సంబంధించిన అన్ని పేపర్లను చూపించాకనే విమానం లోకి అనుమతించారట. కుక్కపిల్లకు సంబంధించిన హెల్త్ సర్టిఫికెట్లు, రేబిస్ వ్యాక్సినేషన్ కు సంబంధించిన పేపర్లను చూశాకనే అధికారులు తనతో పాటు క్యాండీని తీసుకునివెళ్లనిచ్చారని అంటోంది. క్యాండీ ప్రయాణం కోసం అదనంగా 1500 రూపాయలు కట్టానని చెబుతోంది. క్యాండీ బరువు కేవలం 700 గ్రాములే కావడంతో తన కో- ప్యాసెంజర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తనివ్వదని అంటోంది పాయల్.

పాయల్ కు కుక్కలంటే విపరీతమైన ప్రేమ.. ఇప్పటికే ఆమె వద్ద బన్నీ అనే చిహువావా జాతికి చెందిన నాలుగేళ్ల కుక్క కూడా ఉంది. ఇప్పుడు బన్నీకి ఆడుకోవడానికి తోడు కోసం ‘క్యాండీ’ ని పెంచుతున్నానని చెబుతోంది. ఇప్పటికే బన్నీకి ప్రత్యేకంగా ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉందని చెబుతోంది. ఎంతో చిలిపిధైన క్యాండీ కోసం కూడా ఇంస్టాగ్రామ్ అకౌంట్ ను ఏర్పాటు చేస్తానని అంటోంది పాయల్.

ఉత్తర భారతదేశంలోని వాళ్లకు హోలీ ఎంతో ఇష్టమైన పండుగ అని అందుకే తాను కూడా కుటుంబసభ్యులతో జరుపుకోడానికి తన సొంత ఊరికి వెళుతున్నానని చెప్పింది. వండడం కూడా తనకు ఇష్టమేనని.. గుజియా, బర్ఫీ లాంటివి ఈసారి వండబోతున్నట్లు చెప్పింది. తన తల్లి కూడా గొప్పగా వంటలు చేస్తోందని.. హోలీ ఆడాక ఆమె చేతి వంట తినడం ఎంతో ప్రత్యేకమని ఆమె చెప్పుకొచ్చింది. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా హోలీని ఆడడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని తరుణంలో తాను మాత్రం రంగులు చల్లుకుంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తానని చెబుతోంది పాయల్. హోలీ హ్యాంగ్ ఓవర్ కనీసం అంటే రెండు మూడు రోజులు ఉంటుందని చెబుతోంది. పాయల్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఒక లేడీ ఓరియంట్ సబ్జెక్టు సినిమాలో నటిస్తుండగా.. అలాగే జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహిస్తున్న ‘నరేంద్ర’ సినిమాలో ఫైటర్ జెట్ పైలట్ గా పాయల్ నటిస్తోంది. పాయల్ లేటెస్ట్ సినిమాలు డిస్కో రాజా, ఆర్డీఎక్స్ లవ్ భారీ ఫ్లాప్ లు గా నిలిచాయి. వెంకీ మామ మాత్రం మంచి కలెక్షన్లు రాబట్టుకుంది.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.