అప్ప‌టి వ‌ర‌కు ఆర్‌సీబీని వద‌లా.. : కోహ్లీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 April 2020 8:01 AM GMT
అప్ప‌టి వ‌ర‌కు ఆర్‌సీబీని వద‌లా.. : కోహ్లీ

తాను క్రికెట్ ఆడినంత కాలం ఐపీఎల్‌లో ఆర్‌సీబీ(రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ ఆఫ్ బెంగ‌ళూరు) జ‌ట్టును వీడేదిలేద‌ని కోహ్లీ స్ప‌ష్టం చేశాడు. ఆర్‌సీబీ త‌రుపున ఆడుతున్న మ‌రో ఆట‌గాడు మిస్ట‌ర్ 360 డిగ్రీస్.. ఏబీ డివిలియ‌ర్స్‌తో క‌లిసి కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడాడు.

ఐపీఎల్ (ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌) 2008లో మొద‌లైంది. ఇప్ప‌టి వ‌ర‌కు 12 సీజన్లు పూర్తి చేసుకుంది. ఐపీఎల్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ట్టును మార‌ని అతి కొద్ది మంది ఆట‌గాళ్ల‌లో కోహ్లీ ఒక్క‌డు. 2008లో వేలంలో కోహ్లీని ఆర్‌సీబీ ద‌క్కించుకుంది. ఇక 2013 నుంచి ఆ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాగా.. రెండు సార్లు ఫైన‌ల్ చేరిన ఆర్‌సీబీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా ఐపీఎల్ టైటిల్‌ను ద‌క్కించుకోలేక‌పోయింది.

లాక్‌డౌన్ కార‌ణంలో క్రికెట‌ర్లంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. భారత కెప్టెన్ కోహ్లీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇటీవ‌లే ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీట‌ర్స‌న్ తో క‌లిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొన్న కోహ్లీ.. తాజాగా ద‌క్షిణాఫ్రికా మాజీ ఆట‌గాడు, మిస్ట‌ర్ 360 డిగ్రిస్ ఏబీ డివిలియ‌ర్స్‌తో క‌లిసి మ‌రోసారి లైవ్‌లో పాల్గొన్నాడు.

ఈ సంద‌ర్భంగా కోహ్లీ మాట్లాడుతూ.. ఆర్‌సీబీతో ప్రయాణం ఓ అద్భుతమ‌ని, ఐపీఎల్ టైటిల్ ను సాధించ‌డం మా క‌ల అని అన్నాడు. ప్ర‌తి సీజ‌న్‌లో మెరుగ్గా రాణించ‌లేక‌పోయామ‌నే బాధ ఉంటుంద‌ని, అయితే.. బెంగ‌ళూరు జ‌ట్టును వీడే ఆలోచ‌న లేద‌న్నాడు. ఇక అభిమానుల మ‌ద్ద‌తు మ‌రువ‌లేనిద‌ని, టైటిల్ గెల‌వ‌క‌పోయినా కూడా వారి ప్రోత్సాహాం ఎల్ల‌ప్పుడూ జ‌ట్టుకు అందుతోంద‌న్నాడు.

ఇక ఏబీడి కూడా తొమ్మిది సంవ‌త్స‌రాలుగా ఆర్‌సీబీ త‌రుపున ఆడుతున్నాడు. 'నేను కూడా అంతే. ఆర్‌సీబీని ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్లను. పరుగులు సాధిస్తూనే ఉంటాను. అని మిస్టర్‌ 360 అన్నాడు.

దక్షిణాఫ్రికా మాజీ ఆట‌గాళ్లు గ్యారీ క్రిస్టన్‌, డంకన్ ఫ్లెచర్‌, మార్క్‌ బౌచర్ లు త‌న ఆట‌తీరు మెరుగుప‌డేందుకు సాయం చేశార‌ని విరాట్ చెప్పాడు. 'గ్యారీ ఎప్పుడూ సానుకూలంగా స్పందిచేవారు. బౌచర్‌ షార్ట్‌ బంతులను ఎదుర్కొవాలని 2008లో సూచించాడు. అతడికి గొప్ప విజన్‌ ఉంది. ఫ్లెచర్‌కు ఆటపై ఎంతో అవగాహన ఉంది అని విరాట్ తెలిపాడు.

కోహీ, డివిలియ‌ర్స్ క‌లిసి భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్ల‌తో కూడిన‌ అత్యుత్త‌మ జ‌ట్టును ఎంపిక చేశారు. సార‌థిగా భార‌త మాజీ కెప్టెన్ ధోనిని ఎన్నుకొన్నారు.

జ‌ట్టు : స‌చిన్ టెండ్కూల‌ర్‌, రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియ‌ర్స్‌, జాక్వ‌స్ క‌లీస్‌, ధోని(కెప్టెన్‌), యువ‌రాజ్ సింగ్ , చాహ‌ల్, డేల్ స్టెయిన్, బుమ్రా, క‌గిసో ర‌బాడ‌

కాగా..క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఈ ఏడాది ఐపీఎల్ పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి.

Next Story