మనం తినే కరివేపాకులో విషం..FSSAI పరిశీలనలో వెల్లడి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Oct 2019 8:06 PM IST
మనం తినే కరివేపాకులో విషం..FSSAI పరిశీలనలో వెల్లడి..!

"ఆరోగ్యమే మహాభాగ్యం"అన్నారు పెద్దలు. పుష్టిగా తినాలి..కండ పెంచాలి. ఆరోగ్యం బాగుంటేనే మనం ఏం చేయలన్నా?. ఏమైనా సాధించాలన్నా..?.ఫస్ట్..ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం తినాలి. ఇప్పుడు మనం తింటున్నది మంచి ఆహారమేనా?. మనం తినే ఆహారం మన ఆరోగ్యానికి మంచి చేస్తుందా?. మన ఆరోగ్యానికి హాని చేస్తుందా?. మనం తినే ఆహారంలో స్లో పాయిజన్ ఉందా?. మనం తినే కూరగాయలు మనం హెల్త్‌ను కిల్ చేస్తున్నాయా?.

ఇదే ప్రశ్న చాలా మంది పరిశోధకుల్లో తలెత్తింది. అంతే పరిశోధనలు చేయాలనుకున్నారు. దేశవ్యాప్తంగా పలుశాంపిల్స్ సేకరించారు. ఈ పరిశోధనల్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి?. మనం తినే ఆహారం, కూరగాయల్లో ఇంత విషం ఉందా అనే విధంగా కలుషితమయ్యాయి.ఆ పరిశోధన వివరాలేంటో, ఎలా చేశారో చూద్దాం.

వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో శాంపిల్స్ (2017-18)సేకరించింది. కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, కూరల నమూనాలను విశ్లేషించింది. ఆకులు, ఎర్ర కారం, బియ్యం, గోధుమ, పప్పుధాన్యాలు, పాలు, చేపలు / సీ ఫుడ్ , టీ, మాంసం, గుడ్లను సేకరించారు. పలు చోట్ల నుంచి వీటిని సేకరించారు. రిటైల్ అవుట్లెట్లు, ఎపిఎంసి మార్కెట్లు, మదర్ డెయిరీ, సేంద్రీయ అవుట్‌లేట్ల నుంచి నమూనాలు లెక్కగట్టారు. వీటిలో చాలా వరకు పురుగు మందుల అవేశేషాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 27 గుర్తింపు పొందిన ఎన్‌ఏబీల్ ప్రయోగశాలల్లో వీటిని పరిక్షించారు. ఈ పరిశోధనల్లో చాలా మంది పాల్గొన్నారు.

ఈ పరిశోధనలకుగాను 23,660 నమూనాలు సేకరణ

ఈ పరిశోధనలకుగాను శాస్త్రవేత్తలు 23వేల 660 నమూనాలు సేకరించి విశ్లేషించారు. 4వేల510 నమూనాల్లో పురుగు మందుల అవశేషాలు కనుక్కున్నారు. మనం రోజూ తినే ఆహారంలో 19.1 శాతం ఫుడ్‌లో పురుగు మందుల అవశేషాలున్నాయి. ఇంకా ప్రమాదకరమేమంటే.. 523 నమూనాల్లో భారత ఆహార ప్రమాణాల సంస్థ నిర్దేశించిన దాని కంటే ఎక్కువుగా ఉన్నాయి. అంటే 2.2శాతం ఫుడ్ యమ డేంజర్ అన్న మాట.

కూరగాయాలకు కూడా పెస్టిసైడ్స్ గాయాలు..!

వంకాయ, ఓక్రా, టమోటా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్, దోసకాయ, పచ్చి బఠానీ, కొత్తిమీరలకు సంబంధించిన 12వేల 821 కూరగాయల నమూనాలు సేకరించారు. వివిధ మార్కెట్లు, రైతుల దగ్గర నుంచి వీటిని సేకరించారు. 12వేల 821 శాంపిల్స్ సేకరిస్తే వీటిలో 2వేల399 నమూనాల్లో పరుగు మందుల అవశేషాలు కనుగొన్నారు. అంటే.. 18.7 శాతం కూరగాయాల్లో పురుగు మందుల అవశేషాలున్నాయి. 246 మాత్రమే భారత ఆహార ప్రమాణాల సంస్థ నిర్దేశించిన ప్రమాణాలు మించిపోయాయి. ఇంకా..1708 నమూనాల్లో అంటే 13.శాతం కూరగాయలు ప్రభుత్వం అనుమతించని పురుగు మందుల అవశేషాలు కనిపించాయి. ఇది చాలా ప్రమాదకరం.

పండ్లలోనూ పురుగు మందుల అవశేషాలు..!

ఆపిల్, అరటి, ద్రాక్ష, నారింజ, దానిమ్మ, గువా, సపోటా , మామిడి వంటి వివిధ పండ్ల నమూనాలను పరిశీలించారు. 2వేల274 నమూనాలు సేకరించారు. వీటిలో 494(21.7%) నమూనాల్లో పురుగు మందుల అవశేషాలు కనుగొన్నారు . 2,274 నమూనాల్లో 494 అంటే 21.7 శాతంలో పురుగు మందుల అవశేషాలు భారత ఆహార ప్రమాణాల సంస్థ ( FSSAI) ప్రమాణాలను మించిపోయాయి. 1780 (78.3%) పండ్ల నమూనాల్లో పురుగుమందుల అవశేషాలు లేవని గుర్తించారు. ప్రభుత్వం ఆమోదించని పురుగు మందుల అవశేషాలు 12. 8 శాతం ఉన్నాయని కనుగొన్నారు. ఇది చాలా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మాసాలా దినుసుల్లోనూ మందులు..!

యాలకులు, నల్ల మిరియాలు, జీలకర్ర, సోపు గింజ, మెంతి విత్తనం, పొడి అల్లం, కొత్తిమీర, ఎర్ర కారం వంటి వివిధ మసాలా నమూనాలను కూడా సేకరించి విశ్లేషించారు. వీటిలో1,242 నమూనాల సేకరించి విశ్లేషించగా.. 45.2% (561) నమూనాలు పురుగుమందుల అవశేషాలు లేవు. 54.8శాతం అంటే 681 నమూనాల్లో పురుగుమందులను గుర్తించారు. ఇక...12.1 శాతం మసాలా నమూనాల్లో భారత ఆహార ప్రమాణాల సంస్థ ( FSSAI) నిర్దేశించిన దాని కంటే పెస్టిసైడ్స్ ఎక్కువుగా ఉన్నట్లు గుర్తించారు. ఇంకా..677 నమూనాల్లో అంటే 53.7శాతం ఆమోదించబడిని పరుగు మందుల నమూనాలు కనుక్కొన్నారు.

కరివేపాకునూ కాటేసిన పెస్టిసైడ్స్..!

కరివేపాకు ప్రతి కూరలో, పప్పులో, తాళింపులో వాడుతాం. దీనిలో కూడా పెస్టిసైడ్స్‌ను పరిశోధకులు గుర్తించారు. కరివేపాకుకు సంబంధించి 616 నమూనాలను సేకరించారు. పురుగు మందుల అవశేషాలను 438 నమూనాల్లో కనుగొన్నారు. అంటే మనం తినే కరివేపాకులో 50శాతంపైగా విషపూరితమైనవే.

బియ్యం, గోదుమల్లో పురుగు మందుల అవశేషాలు..!

ఇక బియ్యం విషయానికి వస్తే..మొత్తం 1,177 బియ్యం నమూనాలను విశ్లేషించారు. వాటిలో 256 నమూనాల్లో అంటే (21.7శాతంలో పెస్టిసైడ్స్ అవశేషాలు కనుగొన్నారు. 7.2 శాతం బియ్యంలో భారత ఆహార ప్రమాణాల సంస్థ ( FSSAI) నిర్దేశించిన దాని కంటే ఎక్కువుగా ఉన్నాయి. ఇక గోదుముల్లో కూడా పెస్టిసైడ్స్ నమూనాలు కనుగొన్నారు. 783గోదుముల నమూనాల సేకరించగా.. వీటిలో 74 నమూనాల్లో 9.5 శాతంలో పెస్టిసైడ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఒక శాతం ఎంఆర్‌ఎల్ మించి ఉన్నట్లు కనుగొన్నారు.ఆమోదించని పురుగుమందుల అవశేషాలు గోదుమల్లో 5.4 శాతం వరకు ఉన్నాయి. 1.2శాతం భారత ఆహార ప్రమాణాల సంస్థ నిర్దేశించిన దానికంటే ఎక్కువుగా ఉన్నాయి. టీ, ప్యాకేజ్డ్ పాలు, మాంసం/గుడ్లు, చేపలు నమూనాలు కూడా సేకరించి పరిశోధించారు. వీటిలో పెస్టిసైడ్స్ అనవాళ్లు తక్కువే.

హైదరాబాద్ కేంద్రంగా సదస్సు

“జాతీయ స్థాయిలో పురుగుమందుల అవశేషాల పర్యవేక్షణ” (ఎంపిఆర్ఎన్ఎల్) 12 వ వార్షిక వర్క్‌షాప్ జూలై 12, 2018 న తెలంగాణలోని హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) లో జరిగింది, దీనిలో పురోగతి,సమస్యలు ఎంపిఆర్‌ఎన్‌ఎల్ పాల్గొనే కేంద్రాలను సమీక్షించి చర్చించారు . 2018-19 సంవత్సరానికి సాంకేతిక కార్యక్రమాన్ని ఖరారు చేశారు.

ఈ స్థాయిలో పురుగు మందులు చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. వీటి శాతాన్ని మరింతగా తగ్గించే విధంగా కృషి చేయాలని చెబుతున్నారు. ఆరోగ్యానికి మంచిది కాదని, అనేక రకాల రోగాలు వచ్చే అవకాశముంది. దీనిపై భారత ఆహార ప్రమాణాల సంస్థ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఒక రకంగా మనం తింటున్నది అపాయంతో కూడుకున్న ఫుడ్ అని వ్యాఖ్యానించింది. పెస్టిసైడ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ.. రాబోయే తరాలకు కాపాడాల్సిన అవసరముంది.

  • వై.వి.రెడ్డి, న్యూస్ ఎడిటర్, న్యూస్ మీటర్

Next Story