ఢిల్లీలో కొనసాగుతున్న సీఏఏ ఆందోళనలు.. 8 మంది మృతి
By అంజి
ముఖ్యాంశాలు
- అల్లర్లతో అట్టుడుకుతున్న ఢిల్లీ
- సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ
- ఎనిమిది మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు
ఢిల్లీ: దేశ రాజధానిలో సీఏఏకు వ్యతిరేకంగా.. యథేచ్చగా హింస కొనసాగుతోంది. ఈశాన్య ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగుతున్నాయి. సీఏఏ ఆందోళనల్లో ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయారు. భజన్‌పురా తదితర ప్రాంతాల్లో ఆందోళన కారులు రాళ్ల దాడికి తెగబడ్డారు. పలు చోట్ల కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. భారీగా పోలీసులను మోహరించినప్పటికి.. పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఈ ఘటనలో ఇద్దరు జర్నలిస్టులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆందోళనల నేపథ్యంలో పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు.
ప్రజలు అందరూ సంయమనాన్ని పాటించాలని సీఎం కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆర్మీని రంగంలోకి దింపాలని కేంద్రాన్ని సీఎం కేజ్రీవాల్ కోరారు. కాగా ఢిల్లీలో సైన్యాన్ని దింపే ఆలోచన లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో పారమిలటరీ బలగాలను మోహరించినట్లు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. అల్లర్లకు పాల్పడేవారు.. ఏపార్టీ వారైన వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పలు చోట్ల హింసాకారులు వాహనాలను తగలబెట్టారు.
పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టిన వేళ.. సీఏఏకు వ్యతిరేకంగా దేశ రాజధాని దద్దరిల్లింది. ఈశాన్య ఢిల్లీ యుద్ధరంగాన్ని తలపించింది. ఇళ్లు, షాపులకు, వాహనాలకు ఆందోళన కారులు నిప్పుపెట్టారు. అనేక ప్రాంతాలు సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో అట్టుడికిపోయాయి. ఇప్పటి వరకు 70 మందికిపైగా గాయపడ్డారు. జాఫ్రాబాద్, మౌజ్‌పూర్, భజన్‌పురా ప్రాంతాల్లో నిరసకారులు రాళ్లు రువ్వుకున్నారు.
కాగా ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టిన రోజే అల్లర్లు చెలరేగడం వెనక పెద్ద కుట్ర ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. షాహీన్‌బాగ్ వద్ద సీఏఏకు వ్యతిరేకంగా చాలా రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్న ఆందోళనకారులు.. ఇప్పుడు ఒక్కసారిగా రెచ్చిపోవడం వెనక సీఏఏ ఆందోళనను అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లే వ్యూహాలున్నాయని పలువురు రాజకీయ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.