'కరోనా'తో 200 మంది సైనికులు మృతి.?

By సుభాష్  Published on  11 March 2020 4:26 PM IST
కరోనాతో 200 మంది సైనికులు మృతి.?

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ దాదాపు 200పైగా దేశాలకు విస్తరించింది. కరోనా మరణాలు అత్యధికంగా చైనాలో నమోదయ్యాయి. కొవిడ్‌-19 ఇప్పుడు చైనాలో తగ్గుముఖం పట్టినా.. యూరప్‌ సహా పలు దేశాల్లో విజృంభిస్తోంది. కరోనా వల్ల ఇప్పటి వరకు 4వేల 300 మంది మృతి చెందారు. కరోనా మరణాల్లో చైనా తర్వాత ఇటలీ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత దక్షిణ కొరియాలో ఎక్కువ మంది చనిపోయారు. ప్రస్తుతం ఉత్తర కొరియాలో కరోనా వైరస్‌ కారణంగా ఏకంగా 200 మంది మృతి చెందారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. దక్షిణకోరియాకు చెందిన వార్త సంస్థ 'డైలీ ఎన్‌కే' ఈ కథనాన్ని ప్రచురితం చేసింది.

DailyNK కథనం ప్రకారం.. ఉత్తరకొరియాలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో 180 మందికిపైగా సైనికులు మృతి చెందారు. మరో 3,700 మందిని చికిత్స నిమిత్తం క్వారంటైన్‌ సెంటర్లకు తరలించారు. కాగా, మృతుల్లో చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్‌ కొరియాకు చెందిన వైద్య అధికారి ఈ విషయాన్ని బయటపెట్టినట్లు సదరు పత్రిక తన కథనంలో వెల్లడించింది. దేశంలో పలు ప్రాంతాల్లో సైనికులు చనిపోయారని తెలిసింది. ఫిబ్రవరి వరకే దాదాపు 200 మంది చనిపోయారని, మార్చిలో మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌ ఉన్‌ బయటకు పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నారని వెల్లడించింది.

కాగా, చైనాకు ఉత్తరకొరియా సరిహద్దు దేశం. చైనాతో ఉత్తరకొరియా 1,480 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంది. ప్రతిరోజు వేలాది మంది కొరియన్లు చైనాకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే చైనా నుంచి ఉత్తర కొరియాకు కరోనా వ్యాపించిందనే పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కరోనా కారణంగా సైనికులు మృతి చెందారన్న వార్తలను కొరియా ఖండించింది. తమ దేశంలో అసలు కరోనా కేసులే లేవని మీడియాకు వెల్లడించింది. తమదేశంలోకి కరోనా రాకుండా అన్ని చర్యలు చేపట్టామని చెబుతోంది.

ఉత్తర కొరియాలో ఏం జరిగిన బయటకు పొక్కడం కష్టం

మరోవైపు ఉత్తరకొరియాలో ఏం జరిగినా అది బయటకు పొక్కడం చాలా కష్టం. అక్కడ కేవలం ప్రభుత్వం ఆధీనంలో నడిచే మీడియా మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో కరోనా వల్ల సైనికుల మరణాలు బయటకురాకుండా చూడాలని అధ్యక్షుడు కిమ్‌ ఆదేశించినట్లు సమాచారం. ఇక డైలీ ఎన్‌కే పత్రిక దక్షిణ కొరియాకు చెందిన సంస్థ అయినప్పటికీ.. అధికంగా ఉత్తరకొరియాకు సంబంధించిన వార్తలనే ప్రచురిస్తుంది. తమ ఇన్‌ఫార్మర్ల నెట్‌ వర్క్‌ ఆధారంగా ఉత్తరకొరియాలో జరిగే వాస్తవాలను సైతం ప్రచురిస్తుంటుంది.



Next Story