ఆంధ్రా సైనికుడు వీరత్వం చూపించాడు. శతృ తూటాలకు బలైనా.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా తన బాధను దిగమింగుకుని ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఉగ్రముకలను మట్టుబెట్టి శభాష్‌ అనిపించుకున్నాడు. జవాను సరిహద్దులో పోరాడిన తీరుపై ప్రజలందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక వైపు శరీరం వైపు బుల్లెట్లు దూసుకువస్తున్నా.. ఏమాత్రం వెనుకాడకుండా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాడు. దీంతో దేశం మొత్తం ఇప్పుడు అతడికి సెల్యూట్‌ చేస్తోంది.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం చిన్న లొహరిబంద గ్రామానికి చెందిన తామాడ దొరబాబు 9 ఏళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నాడు. సోమవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌ ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో అతడు కీలకంగా మారాడు. దేశ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.

చిన్నలొహరిబంద గ్రామంలో నివసించే తామాడ బైరాగి, కామమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి కొడుకు ఆనందరావు కూడా ఢిల్లీ ఆర్మీ విభాగంలో పని చేస్తున్నాడు. రెండో కుమారుడు దొరబాబు జమ్మూ కశ్మీర్‌లో సేవలందిస్తున్నాడు. ఆ రాష్ట్రంలో 1ఆర్‌ఆర్‌ బెటాలియన్‌లో దొరబాబు జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, ఇటీవల మొత్తం 200 మంది జవాన్లతో కూడిన సెర్‌చ్‌టీంగా కోచ్‌పూర్‌ గ్రామంలో సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. రెండు ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. అనంతరం సమీపంలోని ఓ ఇంటి నుంచి ఒక్కసారిగా కాల్పుల మోత వినబడింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే దొరబాబు కాలులోకి బుల్లెట్‌ దూసుకొచ్చింది. అయినా అతను ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. కిటికీ నుంచి ఇద్దరు ఉగ్రవాదులు కనిపిస్తుండటంతో కాలుకు గాయాలైనా.. తన వద్ద ఉన్న ఏకే-47తో పరుగెత్తుకుంటూ వారిపై కాల్పులు జరిపాడు. 30 రౌండ్ల మేగజైన్‌లోని 27 రౌండ్లు ఉగ్రవాదుల శరీరాన్ని ఛిద్రం చేశాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తనవైపు బుల్లెట్‌ దూసుకువచ్చినా.. వెనుకాడకుండా బుల్లెట్లకు పని చెప్పాడు. తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఇంతటి పోరాటం చేసిన ఉగ్రవాదులను మట్టుబెట్టిన దొరబాబు ప్రశంసలు అందుకుంటున్నాడు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.