అక్కడ కనిపిస్తే కాల్చివేయండి.. కిమ్ కీలక ఆదేశాలు..!
By తోట వంశీ కుమార్ Published on 11 Sept 2020 7:28 PM IST
కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. కాగా.. ఉత్తరకొరియాలో మాత్రం తమ దేశంలో ఒక్క కేసు నమోదు అయినట్లు ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇటీవల దక్షిణ కొరియా నుంచి ఓ వ్యక్తి అక్రమంగా దేశంలోకి ఎంటర్ కావడంతో.. అతడిని కట్టుదిట్టమైన క్వారంటైన్‌లో ఉంచారు. ఆ తరువాత ఆ దేశంలో కరోనా కేసుల గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇదిలా ఉంటే.. కరోనా కట్టడిలో భాగంగా తాజాగా కిమ్ అత్యంత తీవ్రమైన చర్యలకు పూనుకున్నట్లు సమాచారం.
చైనా నుంచి కొంతమంది అక్రమంగా ఉత్తర కొరియాలోకి వస్తున్నారనే సమాచారం ఉండటంతో అధ్యక్షుడు కిమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా నుంచి దేశంలోకి వచ్చే వ్యక్తులను కాల్చేయాలని(షూట్-టు-కిల్) ఆదేశాలు జారీ చేశారట. ఈ విషయాన్ని దక్షిణ కొరియాలో యూఎస్ బలగాలకు కమాండర్‌గా ఉన్న రాబర్ట్ అబ్రహాం తెలిపారు.
చైనాలో కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో ఆ దేశంతో పంచుకునే సరిహద్దులను ఉత్తరకొరియా పూర్తిగా మూసేసింది. చైనా నుంచి ఎవరికి అనుమతి ఇవ్వడం లేదు. సరిహద్దులు మూసివేయడంతో కరోనా కేసులు లోపలికి రాకుండా జాగ్రత్త పడిందని రాబర్ట్ తెలిపారు. చైనా సరిహద్దుల్లో ఉత్తరకొరియా బఫర్ జోన్ ను ఏర్పాటు చేసిందని, ఉత్తర కొరియా స్పెషల్ ఆపరేషన్ బలగాలను, స్ట్రైక్ ఫోర్స్ ను బోర్డర్ లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చైనా-ఉత్తర కొరియా సరిహద్దులో ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న వ్యక్తులు వారు అక్కడ ఉండటానికి గల కారణాలతో సంబంధం లేకుండా చంపేసే అధికారం ఆ దళానికి ఉందని.. ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన చెప్పారు.