Fact Check : నోబెల్ అవార్డు గ్రహీత కోవిద్-19ను చైనా సృష్టించిందని అన్నారా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 April 2020 4:21 PM GMT
Fact Check : నోబెల్ అవార్డు గ్రహీత కోవిద్-19ను చైనా సృష్టించిందని అన్నారా.?

ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకు అతలాకుతలమైంది. చైనాలోని వుహాన్ లో పుట్టిందని చెబుతున్న ఈ వైరస్ ను కొన్ని దేశాల నేతలు ఈ వైరస్ లేబొరేటరీలో చైనా పుట్టించిందని చెబుతున్నారు. మరో వైపు చైనా మాత్రం మాంసపు మార్కెట్ లో నుండి వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం నోబెల్ అవార్డు సాధించిన జపనీస్ ప్రొఫెసర్ చెప్పిన మాటలంటూ ఓ మెసేజీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

2018లో నోబెల్ అవార్డు అందుకున్న జాపనీస్ ప్రొఫెసర్ 'టసుకు హొంజో' కు సంబంధించిన ఓ మెసేజీ ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సప్ లలో విపరీతంగా వైరల్ అవుతోంది. 'కోవిద్-19 సహజంగా పుట్టినది కాదు' అని ఆయన అన్నారన్న మెసేజీ అది.

ఇంతకూ ఆ మెసేజీలో ఏముంది అంటే..

జపాన్ కు చెందిన ప్రొఫెసర్ ఆఫ్ ఫిజియోలజీ లేదా మెడిసిన్, ప్రొఫెసర్ టసుకు హొంజో మీడియా ముందుకు వచ్చి కరోనా వైరస్ అన్నది సహజంగా రాలేదు. ఇది సహజంగా వచ్చి ఉన్నట్లయితే అది ప్రపంచ వ్యాప్తంగా రావాల్సి ఉండేది. కానీ ఒక్కో దేశంలో ఒక్కో వాతావరణ పరిస్థితి. ఈ వైరస్ ముఖ్యంగా ఏయే దేశాల్లో చైనా లాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో ఆ దేశాల్లో మాత్రమే విజృంభిస్తోంది. సిజర్లాండ్ లాంటి దేశాల్లో ఈ వైరస్ ప్రబలకుండా చాలా వరకూ ఎడారి ప్రాంతాల్లో ప్రబలుతోంది. అదే సహజంగా వచ్చిన వైరస్ అయితే అది ఎక్కువ చలి ఉన్న దేశాల్లో కూడా ప్రబలే అవకాశం ఉంది. నేను 40 సంవత్సరాలు జంతువులపైనా, వైరస్ ల పైనా అధ్యయనం చేశాను. ఈ వైరస్ మాత్రం సహజమైనది కాదు. దీన్ని కృత్రిమంగా తయారు చేశారు. నేను నాలుగేళ్ల పాటూ వుహాన్ లోని లేబొరేటరీలో పనిచేశాను. అక్కడి స్టాఫ్ తో కూడా నాకు బాగా పరిచయాలు ఉన్నాయి. కరోనా ఘటన చోటుచేసుకున్నాక నేను వాళ్లకు ఫోన్ చేయాలని చూసాను. గత మూడు నెలలుగా వాళ్లు కనీసం ఫోన్ లు కూడా ఎత్తడం లేదు. దీన్ని బట్టి తెలుస్తోంది ఏమిటంటే.. ల్యాబ్ లో పని చేసే టెక్నీషియన్లు కూడా చనిపోయారు.

నా దగ్గర ఉన్న సమాచారం ప్రాకారం కరోనా వైరస్ అన్నది 100 శాతం కృత్రిమంగా తయారు చేసినది. గబ్బిలాల వలన రాలేదు. చైనానే దాన్ని తయారు చేసింది. నేను చెప్పింది తప్పు అని ఎవరైనా నిరూపిస్తే నా నోబెల్ ప్రైజ్ ను ప్రభుత్వాన్ని విత్ డ్రా చేసుకోమని చెబుతున్నాను. చైనా అబద్ధాలు చెబుతోంది. ఏదో ఒకరోజు నిజం ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది.

ఈ మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Ji

ఇంతకూ నిజం ఏమిటంటే:

పై మెసేజీపై న్యూస్ మీటర్ చేసిన సెర్చ్ లో తెలిసింది ఏమిటంటే అదంతా 'పచ్చి అబద్దం' అని. టసుకు హొంజో నోబెల్ బహుమతిని పొందిన ప్రొఫెసర్. జపాన్ లోని క్యోటో యూనివర్సిటీలో ఆయన విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. 2018లో మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ ను సొంతం చేసుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అంటూ వైరల్ అవుతున్న మెసేజ్ పచ్చి అబద్ధం అని ఆయనే తెలిపారు. ప్రొఫెసర్ దగ్గర పని చేస్తున్న అలోక్ కుమార్, పిహెచ్డి విద్యార్థి స్పందించారు. వైరల్ అవుతున్న మెసేజీలో ఉన్నదంతా పచ్చి అబద్ధమని.. హొంజో ఆయన జీవితంలో ఎప్పుడూ వుహాన్ లేబరేటరీలో పని చేయలేదు. ఆయన వైరస్ లపై అసలు రీసర్చ్ చేయలేదు. ఆ కామెంట్లు మొత్తం అబద్ధమే..!

1j

ఇక ఆయన బొయోగ్రఫీ చూసినా ఎక్కడ కూడా వుహాన్ ప్రస్తావన అన్నది లేదు. 1984 నుండి 2005 వరకూ ఆయన క్యోటో యూనివర్సిటీలో ఫుల్ టైమ్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ప్రస్తుతం కూడా ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇమ్యునాలజీ అండ్ జెనోమిక్ మెడిసిన్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అని కూడా ఎక్కడ కూడా ఎటువంటి వార్తా సంస్థలు కూడా ప్రచురించలేదు.

Nikkei Asian Review కి మాత్రమే ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన అందులో మాట్లాడుతూ కరోనా వైరస్ చైనాలో మొదట వచ్చిందని.. రికవరీ అయిన మొదటి దేశం కూడా చైనానే అని ఆయన అన్నారు. దీని వలన చైనా ప్రాభవం కొనసాగుతుందా లేక.. ప్రపంచం ముందు చైనా తలవంచుకుంటుందా అన్నది తాను చెప్పలేనని.. కానీ ఈ మహమ్మారి ప్రబలిన తర్వాత చాలా మార్పులు వచ్చాయని అన్నారు. ఆ ఇంటర్వ్యూలో కోవిద్-19 గురించి ఎక్కడ కూడా ఆయన మనుషులే వైరస్ ను సృష్టించారని చెప్పలేదు.టసుకు హొంజో అని యూజర్ నేమ్ ఉన్న ట్విట్టర్ అకౌంట్ లో మాత్రం “I do not know for what purpose the coronavirus has been produced, but I can definitely say that it is man-made.” అని రాశారు. ఈ ట్వీట్ కు నిజమైన టసుకు హొంజోకు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది. ప్రొఫెసర్ హొంజో స్పందిస్తూ కావాలనే తన మీద తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు.

టసుకు హొంజో చెప్పారని వస్తున్న వార్తలన్నీ పచ్చి అబద్ధం.

Next Story
Share it