బంగ్లా అభిమానులు మద్దతివ్వరు: రోహిత్
By తోట వంశీ కుమార్ Published on 17 May 2020 11:05 AM ISTభారత్‌లో క్రికెట్ అంటే ఓ క్రీడ కాదు. ఓ మతం. ఓ ప్రాణం. అంతకన్నా ఎక్కువే. క్రికెట్ కోసం ప్రాణాలు ఇచ్చే వీరాభీమానులు ఎంతో మంది ఉన్నారు. క్రికెటర్లను దేవుళ్లుగా ఆరాధిస్తారు. ప్రపంచంలో టీమ్ఇండియా ఎక్కడ ఆడినా కానీ భారత జట్టుకు ఖచ్చితంగా మద్దతు లభిస్తుంది. విదేశాల్లో ఆడుతున్నా సరే.. టీమ్ఇండియాకు లభించే మద్దతు చూస్తే.. ఒక్కోసారి తాము భారత్‌లో ఆడుతున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుందని పలువురు క్రికెటర్లు చాలా సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ ఒక్క దేశంలో మాత్రం టీమ్ఇండియా కనీస మద్దతు లభించదని అంటున్నాడు భారత స్టార్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. మరీ అది ఏ దేశమో కాదు బంగ్లాదేశ్ అని చెప్పాడు.
బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్భాల్‌తో కలిసి రోహిత్ శర్మ ఫేస్‌బుక్ లైవ్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వీరిద్దరు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. పసికూన జట్టు నుంచి బంగ్లాదేశ్ ఎదిగిన తీరు అద్భుతమని కొనియాడాడు. భారత్, బంగ్లాదేశ్‌లో క్రికెట్ వీరాభిమానులు ఎక్కువగా ఉన్నారని, వారు ఆటను ఎంతగా ఇష్టపడతారో మన వల్ల ఏదైన తప్పు జరిగితే మాత్రం అంతకంటే ఎక్కువగా విమర్శిస్తారు. ఇక బంగ్లాదేశ్‌లో అయితే ఆ పిచ్చి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎంతలా అంటే భారత్ అక్కడ మ్యాచ్ ఆడితే.. ప్రేక్షకుల నుంచి కనీసం స్థాయిలో కూడా మద్దతు లభించదు. ఇదే చాలా సందర్భాల్లో తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని రోహిత్ చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా టీమ్ఇండియాకు మద్దతు దొరకని ప్రదేశం ఏదైనా ఉందంటే అది బంగ్లాదేశ్ మాత్రమేనని చెప్పుకొచ్చాడు. ఇక ఐసీసీ టోర్నీలో బంగ్లాదేశ్‌పై రోహిత్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 2015 వన్డే ప్రపంచకప్, 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్ లలో బంగ్లాపై రోహిత్ సెంచరీలు సాధించాడు.
ఇక హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కారణంగా అభిమానుల నుంచి తాను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని తమీమ్ ఇక్భాల్ గుర్తు చేసుకున్నాడు. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచులో రోహిత్ శర్మ 9 పరుగులు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను తమీమ్ వదిలేశాడు. ఆ తరువాత రోహిత్ చెలరేగి సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచింది. రోహిత్ భాయ్ నువ్వెందుకు మా పై నీ విశ్వరూపాన్ని చూపిస్తావు.? 2015 ప్రపంచకప్ క్వార్టర్‌లో, 2017 ఛాంపియన్స్ ట్రోపీలో, 2019 ప్రపంచకప్ కప్ లో నా పొరపాటు కారణంగా సెంచరీలు బాదావు. అప్పుడు ప్రేక్షకులు స్పందించిన తీరు ఇంకా గుర్తు ఉంది. ఎలాగైనా నువ్వు ఔట్ కావాలని కోరుకున్నా. కానీ నువ్వు 40 పరుగులకు చేరుకోవడంతో ఏం జరగబోతోందో ముందుగానే నాకు అర్థమైందంటూ అప్పటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు తమీమ్.