మినీఐపీఎల్.. 8 జట్లు 2 గ్రూపులు..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 March 2020 1:49 PM GMT
మినీఐపీఎల్.. 8 జట్లు 2 గ్రూపులు..?

కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్)ను ఏప్రిల్‌ 15కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. శనివారం ఐపీఎల్‌ ప్రాంఛైజీల యజమానులు, బీసీసీఐ సమావేశం ముగిసింది. ఇందులో ఐపీఎల్‌-13 సీజన్‌ నిర్వహణ గురించి సవివరంగా చర్చించారు. ఒకవేళ ఐపీఎల్‌లో ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం మొత్తం మ్యాచ్‌లు సాధ్యం కాని పక్షంలో.. మినీ ఐపీఎల్‌ నిర్వహించాలని సమావేశంలో చర్చించారట.

కరోనా వైరస్‌ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. ఐపీఎల్‌ను వాయిదా వేయడంతో పాటు భారత్‌-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను రద్దు చేశారు. ఐపీఎల్‌ వాయిదా వేయడంతో ప్రాంఛైజీలతో శనివారం బీసీసీఐ సమావేశం నిర్వహించింది. ఆకాశ్‌ అంబాని(ముంబాయి ఇండియన్స్‌), పార్థ్‌ జిందాల్‌(ఢిల్లీ క్యాపిట్స్‌), షారుఖ్‌ఖాన్‌(కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌), సహా ప్రాంఛైజీల యజమానులతో పాల్గొన్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షాతో చర్చించారు.

ఈ సమావేశంలో ఆరు నుంచి ఏడు అంశాలు చర్చించారని తెలిపారు.

1. ఐపీఎల్‌ ను కుదించి మ్యాచులు నిర్వహించడం

2. 8జట్లను నాలుగు చొప్పున రెండుగా విడదీసి అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లతో ప్లే ఆఫ్స్‌ ఆడించడం

3. వారాంతాల్లో(వీకెండ్స్‌.. శని, ఆదివారం) రెండు మ్యాచులు నిర్వహించడం

4. ఆటగాళ్లు, అధికారులు, టీవీ, మైదాన సిబ్బంది ఎక్కువ ప్రయాణాలు చేయనీకుండా రెండు మూడు వేదికల్లోనే అన్ని మ్యాచులు నిర్వహించడం

5. తక్కువ సమయంలో సీజన్‌లోని 60 మ్యాచుల్ని ఖాళీ స్టేడియాల్లో ఆడించడం

వంటి అంశాల్ని ఈ సమావేశంలో చర్చించారు. విదేశాల్లో ఐపీఎల్‌ను నిర్వహించడం గురించి అసలు సమావేశంలో చర్చించలేదని ఆ అధికారి తెలిపారు.

ఐపీఎల్‌ను ఎక్కువలో ఎక్కువ 31 వరకు పొడిగించొచ్చని ఓ ప్రాంచైజీ అధికారి చెప్పారు. మా ముందున్న అవకాశాలను పరిశీలించి చర్చించేందుకే ఈ సమావేశం. ఇప్పటికైతే ఎలాంటి స్పష్టత లేదు. వేర్వేరు పరిస్థితుల్లో టోర్నీ నిర్వహాణకు అవకాశాలు ఎలా ఉంటాయో అందరం ఆలోచించామని తెలిపారు.

ఇక ఏప్రిల్‌ రెండో వారంలో అప్పటి పరిస్థితిపై బీసీసీఐ మరోసారి సమావేశం కానుంది. అప్పటి పరిస్థితులను బట్టి.. మినీ ఐపీఎల్‌ను నిర్వహించే అవకాశాన్ని ఉందని పలు ప్రాంఛైజీ యజమానులు అభిప్రాయపడ్డారు. ఏదీఏమైనా విదేశీ ఆటగాళ్లు లేకుండా మాత్రం ఐపీఎల్‌ను నిర్వహించకూడదని ఫ్రాంచైజీ ఓనర్లు బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు.

Next Story