టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, అగ్రశ్రేణి కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కొంతకాలంగా కామెంట్రీ బాక్స్‌లో నోరుజారుతూ విమర్శలు ఎదుర్కొంటున్న మంజ్రేకర్‌ని కామెంట్రీ ఫ్యానల్ నుంచి బీసీసీఐ తప్పించింది. కొనేళ్లుగా స్వదేశంలో భారత్‌ ఆడే మ్యాచులకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అతను ఈ సారి ఐపీఎల్‌లోనూ కనిపించడు.

1996‌లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్‌మెంట్‌ ప్రకటించిన సంజయ్ మంజ్రేకర్ ఆ తర్వాత కామెంటేటర్‌గా స్థిరపడ్డాడు. ధర్మశాలలో గురువారం దక్షిణాఫ్రికాతో జరగాల్సిన తొలి వన్డే వర్షం వల్ల రద్దైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌కు మంజ్రేకర్‌ మినహా మిగతా వ్యాఖ్యాతలు సునీల్‌ గవాస్కర్‌, ఎల్‌ శివరామకృష్ణన్, మురళీ కార్తీక్‌ మాత్రమే కామెంటరీ ప్యానెల్‌లో పాల్గొన్నారని ఒక పత్రిక తన కథనంలో ప్రచురించింది. కాగా వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండా ఆ మ్యాచ్‌ రద్దయిన సంగతి తెలిసిందే.

కాగా మంజ్రేకర్‌ను తొలగించడానికి గల కారణాలు తెలియరాలేదు. బీసీసీఐ అధికారులకు అతని పనితీరు నచ్చలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మంజ్రేకర్‌ గతేడాది రెండు సార్లు సామాజిక మాధ్యమాల్లో టీమ్‌ఇండియా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. గతేడాది జరిగిన వరల్డ్‌కప్‌ సందర్భంగా టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై మంజ్రేకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘ రవీంద్ర జడేజా లాంటి బీట్స్‌ అండ్‌ పీసెస్‌ ఆటగాళ్లకు తాను ఫ్యాన్‌ కాదని, జడేజా టెస్టు క్రికెటర్‌ మాత్రమేనని, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అతడు అన్‌ఫిట్‌ అంటూ’ అంటూ పేర్కొన్నాడు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. దీనికి జడేజా కూడా ధీటుగానే బదులిచ్చాడు. ఆ తర్వాత సహచర కామెంటేటర్‌ హర్షా భోగ్లేపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత మంజ్రేకర్‌ క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికి సోషల్‌మీడియాలో నెటీజన్లు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.