ఇకపై బెంగళూరులో లాక్ డౌన్ ఉండదు.. ప్రజలు సహకరించాలని కోరిన యడ్యూరప్ప
By సుభాష్ Published on 22 July 2020 7:48 AM ISTబెంగళూరు: బెంగళూరు నగరంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా వారం రోజుల పాటూ లాక్ డౌన్ ను విధించారు. జూన్ 22 తో లాక్ డౌన్ ముగియనున్న కారణంతో ఇకపై బెంగళూరులో లాక్ డౌన్ ఉండదని ప్రజలు సహకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప కీలక ప్రకటన చేశారు. కరోనా వైరస్ ను అదుపులోకి తీసుకుని రావడానికి తమ ప్రభుత్వం 24 గంటలూ కష్టపడుతోందని అన్నారు.
బెంగళూరు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో జులై 14 రాత్రి ఎనిమిది గంటల నుండి జులై 22 సాయంత్రం 5 గంటల వరకూ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. జులై 22తో లాక్ డౌన్ ముగియనుండడంతో యడ్యూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను ప్రజలకు ఓ విషయం చెప్పాలని అనుకుంటూ ఉన్నా.. ఇకపై బెంగళూరు లోనూ, కర్ణాటక లోనూ ఎటువంటి లాక్ డౌన్ లు ఉండవు. కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే లాక్ డౌన్ అన్నది పాటించాల్సి ఉంటుంది.. దయచేసి ప్రజలు సహకరించాలని' యడ్యూరప్ప ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ ను మరో 15 రోజుల పాటూ పొడిగించే అవకాశాలు ఉన్నాయని వదంతులు వ్యాప్తి చెందుతున్న తరుణంలో వాటికి స్వస్థి చెబుతూ యడ్యూరప్ప ఈ వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు నగరంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో వారం రోజుల పాటూ లాక్ డౌన్ ను ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళను వీలైనంత తొందరగా ట్రాక్ చేయాలని యడ్యూరప్ప అధికారులకు సూచించారు. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు.
ఆసుపత్రుల్లో బెడ్లు తక్కువగా ఉండడమే కాకుండా.. అంబులెన్స్ లు కూడా అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు. ఈ సమస్యపై కూడా యడ్యూరప్ప స్పందించారు. అంబులెన్స్ లతో సమస్య ఉందని చెబుతున్నారు.. బూత్ లెవల్ నుండి సమస్య అన్నది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. బెంగళూరులో 11000కు పైగా బెడ్స్ ఉన్నాయని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు సహకరించాలని కోరారు. 55 సంవత్సరాలు పైన ఉన్న వారు బయట తిరగకూడదని.. ఇళ్లల్లోనే ఉండాలని సూచించారు. పిల్లలను కూడా ఇంటి నుండి బయటకు పంపకూడదని ప్రజలని కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు వేసుకోవాలని.. సామాజిక దూరం పాటించాలని కోరారు.