లాక్‌ డౌన్‌లు కాదు.. ముందు అలా చేయండి - ప్రపంచ ఆరోగ్య సంస్థ

By Newsmeter.Network  Published on  23 March 2020 4:05 AM GMT
లాక్‌ డౌన్‌లు కాదు.. ముందు అలా చేయండి - ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్‌ 190 దేశాలకు విస్తరించింది. రోజురోజుకు వైరస్‌ మరింత విజృంభిస్తుండటంతో ఆయా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ వైరస్‌ భారినపడి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 14,650 మందికిపైగా మృతి చెందడంతో పాటు 3,37,533 మంది ఈ వైరస్‌ భారిన పడి చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లోనే 1,450 మంది మృతిచెందడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు చికిత్స పొందుతున్న వారిలో 90వేల మంది కోలుకోగా, 2.13 లక్షల మంది పరిస్థితి నిలకడగా ఉండగా, 10,550 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. అత్యధికంగా ఇటలీలో ఆదివారం ఒక్కరోజే 651 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లోనూ కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దేశంలో ఇప్పటికి 396 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతిచెందారు. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని దేశాలు లాక్‌ డౌన్‌ను ప్రకటిస్తున్నాయి. భారత్‌ మొత్తం లాక్‌డౌన్‌ దిశగా పయనిస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో సహా 12 రాష్ట్రాలు ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. మిగిలిన రాష్ట్రాలుసైతం అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.

Read also : తెలంగాణలో 27కు చేరిన కరోనా కేసులు

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం లాక్‌డౌన్‌ చేసినంత మాత్రాన కరోనా వైరస్‌ ప్రభావం తగ్గదని పేర్కొంది. లాక్‌డౌన్‌ పేరుతో ఇండ్లకే పరిమితం వల్ల ఈ వైరస్‌ అంతం సాధ్యం కాదని, ఈ మహమ్మారిని అంతమొందించలేమని డబ్ల్యూహెచ్‌ఓ హై రిస్క్ నిపుణుడు మైక్‌ ర్యాన్‌ పేర్కొన్నారు. తొలుత మన ప్రాంతంలో కరోనా వైరస్‌ భారిన పడ్డవారిని గుర్తించాలన్నారు. వారందర్ని గుర్తించాక ఐసోలేషన్‌లో ఉంచి వైరస్‌ బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు. అంతేకాని వైరస్‌ సోకిన వ్యక్తిని గుర్తించకుండా లాక్‌డౌన్‌ ప్రకటిస్తే ఎలాంటి ఫలితం ఉండదని మైక్‌ ర్యాన్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్‌ సోకిన వారిని గుర్తించేందుకు జల్లెడ పడుతున్నారు. ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారే కరోనా వైరస్‌ భారిన పడుతుండటంతో గ్రామ, పట్టణ స్థాయిల్లో వారిని గుర్తించి ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు.

Also read :టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ వివాదాస్పద వీడియో.. అరెస్టు చేసిన పోలీసులు

Next Story