టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ వివాదాస్పద వీడియో.. అరెస్టు చేసిన పోలీసులు

By Newsmeter.Network  Published on  22 March 2020 10:19 AM GMT
టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ వివాదాస్పద వీడియో.. అరెస్టు చేసిన పోలీసులు

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేలాది మంది ఈ వైరస్‌ భారిన పడి మృతిచెందగా.. లక్షలాది మంది ఈ వైరస్‌ భారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారత్‌లోనూ ఈవైరస్‌ చాపకింద నీరులా విస్తరి స్తోంది.. ఈ వైరస్‌ భారిన పడిఇప్పటికే భారత్‌లో ఆరుగురు మృతిచెందగా.. 340కిపైగా వైరస్‌ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. యావత్‌ దేశమంతటా జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రహదారులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. మోదీతో పాటు సీఎం కేసీఆర్‌సైతం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 14గంటలు కర్ఫ్యూ కొనసాగనుండగా.. తెలంగాణలో 24గంటలు కర్ఫ్యూ పాటించాలని కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో కరోనాపై యుద్ధంలో తెలంగాణ ప్రజలంతా భాగస్వాములై ఇళ్లకే పరిమితమయ్యారు.

ఈ నేపథ్యంలో సంగారెడ్డి లో ఓ ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డికి చెందిన టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ సమి అనే వ్యక్తి ఇటు ప్రధాని విజ్ఞప్తిని అటు సీఎం కేసీఆర్‌ ఆదేశాలను బేఖాతరు చేశారు. జనతా కర్ఫ్యూకి ముస్లింలు మద్దతివ్వొద్దని, ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ఒక చెవితో విని.. మరొక చెవితో వదిలి పెట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా పెద్ద ఎత్తున రోడ్లపైకి రావాలని సమి పిలుపునిచ్చారు. ఆ వీడియోకాస్త వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి కౌన్సిలర్‌ సమిని అరెస్టు చేశారు.

ఇదిలా ఉంటే శనివారం జరిగిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూపై కొందరు సోషల్‌ మీడియాలో అవహేళన చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాని స్థాయి వ్యక్తిని ఈరకంగా కించపర్చడం ఏంటని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, వారిని గుర్తించి అరెస్టు చేయాలని డీజీపీ మహేందర్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఇదే సమయంలో జనతా కర్ఫ్యూ, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వీడియో పోస్టు చేసినందుకు కౌన్సిలర్‌ సమిని పోలీసులు అరెస్టు చేశారు.

crime

సమీ అరెస్టు విషయాన్ని సంగారెడ్డి జిలా ఎస్పీ ఎస్‌. చంద్రశేఖర్‌రెడ్డి ధ్రువీకరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన 24గంటల జనతా కర్ఫ్యూకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి పట్టణానికి చెందిన 34వార్డు కౌన్సిలర్‌ మహమ్మద్‌ సమిపై క్రైమ్‌ నెంబర్‌ 79/2020 యూ/ఎస్‌ 188 ఐపీసీ ప్రకారం సంగారెడ్డి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, గృహనిర్బంధంలో ఉంచడం జరిగిందని తెలిపారు. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Next Story