తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు. తాను రాజకీయల్లోకి వస్తున్నట్లు, ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ గానీ, ఇతర పార్టీలు గానీ తనను కోరలేదని చెప్పారు. తాను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పైన పోటీకి దిగుతున్నానని, కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చేందుకు సిద్ధంగా  ఉందని వస్తున్న వార్తలను ఆమె కొట్టిపారేశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఎవ్వరు నమ్మవద్దని, తాను కాంగ్రెస్‌ పార్టీ నేతలతో మాట్లాడలేదని, ఈ వార్త ఎలా ప్రచారం అవుతుందో తనకు తెలియదన్నారు.

అలాగే తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, తన కుమార్తెకు మద్దతుగా నిలిచానని అన్నారు. మహిళలపై ఏవైనా అఘాయిత్యాలు జరిగితే న్యాయం కోసం పోరాడేందుకు ముందుంటానని స్పష్టం చేశారు. నిర్భయ విషయంలో ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని అన్నారు. తన కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడిన నలుగురు దోషులకు ఉరిశిక్ష పడాలని కోరుతున్నానని అన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.