FACT CHECK: నిజమెంత: ఒక్కో కోవిద్-19 పేషెంట్ కు కేంద్రప్రభుత్వం 1.5 లక్షల రూపాయలు ఇస్తోందా..?
By సుభాష్ Published on 29 Aug 2020 1:40 PM IST
ఒక్కో కోవిద్-19 పేషెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం 1.5 లక్షల రూపాయలు కేటాయించిందని.. వాటిని మున్సిపాలిటీలకు ఇస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు వైరల్ అవుతున్నాయి. కొందరు ప్రైవేట్ డాక్టర్లు కరోనా పేషెంట్స్ సంఖ్యను ఎక్కువగా చూపించి కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బు లాగేస్తూ ఉన్నారని ప్రచారం చేస్తున్నారు.
ప్రముఖ రాజకీయ నాయకురాలు గీతా జైన్ కు సంబంధించిన ఫోటోను ఉంచి.. ఒక్కో మున్సిపాలిటీ/ప్రైవేట్ ఆసుపత్రికి కోవిద్-19 పాజిటివ్ పేషెంట్ కోసం 1.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందంటూ పోస్టులు వైరల్ చేస్తూ ఉన్నారు.
దీని మీద నిజం తెలియజేయాలంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో అడిగారు.
ఇక వైరల్ అవుతున్న వాట్సప్ మెసేజీలను కూడా గమనించవచ్చు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఈ పోస్టులు 'అబద్ధం'
న్యూస్ మీటర్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక వెబ్ సైట్స్ ను పరిశీలించగా అందులో ఎక్కడ కూడా దీనికి సంబంధించిన పోస్టు కనిపించలేదు. అఫీషియల్ న్యూస్ ఆర్గనైజేషన్లు కూడా ఈ విషయంపై ఎలాంటి కథనాలు, వార్తలను పోస్టు చేయలేదు.
కీ వర్డ్స్ ను ఉపయోగించి చూడగా ఎమ్మెల్యే గీతా జైన్ వైరల్ అవుతున్న వార్తలపై తన స్పందనను తెలియజేసింది. వైరల్ అవుతున్న పోస్టులలో ఎటువంటి నిజం లేదంటూ ఆమె వెల్లడించింది. వీడియో ఫేక్ అని తన మీద వస్తున్న ఆ ఫేక్ వీడియోను నమ్మకండి అని తెలిపింది. అలాగే ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సైబర్ సెల్ ను ఆమె ఆశ్రయించారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఈ వార్తను ఖండిస్తూ ట్వీట్లు చేశారు. అందుకు సంబంధించిన ట్వీట్ ను తన అధికారిక ఖాతాలో పోస్టు చేశారు. ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో పేషెంట్ కు 1.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందన్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది.
“Claim: A message circulating on #WhatsApp claims that the Central Government is providing Rs 1.5 lakh to every Municipality for each #COVID19 patient. #PIBFactCheck: The claim is #Fake. No such announcement has been made by Government (sic) . https://t.co/Ntr137aIUY” అని చెప్పుకొచ్చారు.
ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో పేషెంట్ కు 1.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందన్న వార్త 'పచ్చి అబద్ధం'