వారి ప్రేమకు కరోనా కూడా ఫిదా అయింది..
By రాణి Published on 30 March 2020 7:17 PM IST
కరోనా పేరు వింటేనే చాలు. ప్రపంచమంతా గడగడలాడిపోతోంది. దాదాపు భూగోళమంతా లాక్ డౌన్ అయిపోయింది. భూమ్మీదే కాదు..ఆకాశంలో ఎగిరే విమానాల రాకపోకలను సైతం ఆపేసింది కరోనా. మానవ సంబంధాలు తెగిపోయాయి. ఎక్కడివాళ్లక్కడే ఆగిపోయారు. ప్రపంచమంతా స్తంభించిపోయింది. కానీ ఆ ప్రేమికులను మాత్రం ఏదీ అడ్డుకోలేకపోయింది. కరోనా కూడా ప్రేమకు అడ్డు రాలేదు. వృద్ధాప్యంలోనూ వారు తమ ప్రేమ కోసం ఆరాటపడటం చూసి కరోనా కూడా ఫిదా అయిందేమో. రోజూ కలుసుకుంటున్న ఆ వృద్ధ ప్రేమ జంట జోలికి వెళ్లలేదు.
Also Read : మాంసం ధరలు పెంచితే కఠిన చర్యలు : మంత్రి తలసాని
అతని పేరు హన్‌సెన్ ఆమె పేరు ఇంగా రాస్‌ముసెన్. రెండేళ్ల క్రితం వారు ఒక కార్యక్రమంలో పరిచయమయ్యారు. అప్పటికే వారు తమ జీవిత భాగస్వాములను కోల్పోయివున్నారు. వారి మధ్య మాటలు కొనసాగేవి. అనంతరం ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. తమ ప్రేమను బయటపెట్టారు. అప్పటి నుంచి ఇద్దరూ ప్రతిరోజూ షికార్లు చేసేవారు.
Also Read : పేలిన గ్యాస్ సిలిండర్.. క్రికెటర్ భార్యకు తీవ్రగాయాలు
ఆయన జర్మనీలో నివసిస్తుండగా ఆమె డెన్మార్క్‌లో ఉంటోంది. అయితే తాజాగా కరోనా నిబంధనలు వారికి అడ్డంకిగా మారాయి. కరోనా నేపథ్యంలో డెన్మార్క్ తన సరిహద్దులను మూసివేసింది. అనంతరం కొద్దిరోజులకే జర్మనీ కూడా మూసివేసింది. దీంతో ప్రతిరోజు కలుసుకొని కబుర్లు చెప్పుకునే వీరికి చాలా కష్టం కలిగింది. అయితే ప్రతిరోజు తమ దేశ సరిహద్దుల వరకు చేరుకుంటున్నారు. బారికేడ్‌కు ఇరుపక్కల కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. ఫ్లాస్క్‌లో తెచ్చిన కాఫీ ఇచ్చిపుచ్చుకుంటారు. అలా కరోనాను కూడా లెక్కచేయకుండా కాలం వెళ్లదీస్తున్నారు. విశేషం ఏమిటంటే..ఈ జంట కలుసుకోవడానికి సరిహద్దులో ఉన్న భద్రతా సిబ్బంది కూడా సహకరిస్తున్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా నశించాక తామిద్దరం కలిసి మరిన్ని ప్రాంతాలకు టూర్లకు వెళ్తామంటున్నారు.