అక్టోబర్‌ 9న నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sept 2020 7:01 PM IST
అక్టోబర్‌ 9న నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఖాళీగా ఉన్న స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అక్టోబర్‌ 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 12న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపడతారు. ముందుగా విడుదలైన నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్‌ 7న పోలింగ్‌ జరగాల్సి ఉండగా కరోనా వైరస్‌ కారణంగా ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది.

టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్‌ వేశారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయన్ని అనర్హుడిగా ప్రకటిస్తూ ఆప్పటి మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీని టీఆర్‌ఎస్‌ సునాయాసంగా గెలుచుకునే అవకాశాలున్నాయి.

Next Story