ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.. కట్నం తేలేదని
By తోట వంశీ కుమార్ Published on 27 April 2020 1:48 PM IST
ఇద్దరూ కలిసి ఓకే చోట పనిచేసేవారు. దీంతో వారి మనసులు కలిసాయి. ప్రేమ వివాహం చేసుకున్నారు. అయిన వారందరిని వదిలి ఆమె అతనితో కలిసి జీవిస్తోంది. అయితే.. కట్నం తేలేదని చివరకు ప్రేమించిన వాడే ఆ యువతి పాలిట కాలయముడయ్యాడు. మృతదేహాన్ని గుర్తించకుండా మంటల్లో మసి చేశాడు. ఈ ఘటన మక్లూర్ మండలం రాంచంద్రపల్లి అటవీ ప్రాంతంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా అర్థవీడు మండలంకు చెందిన రాధ(23) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. నిజామాబాద్ జిల్లా నవీపేట్‌లోని శివతండాకు చెందిన ఓ యువకుడు అదే సంస్థలో పనిచేస్తున్నాడు. వీరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరి పెళ్లికి యువకుడి తల్లిదండ్రులు ఒప్పుకోగా.. యువతి తల్లిదండ్రులు మాత్రం నిరాకరించారు. అయినప్పటికి వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం పాటు వీరిద్దరి కాపురం సజావుగా సాగింది. లాక్‌డౌన్ నేపథ్యంలో శివతండాలోని యువకుడి ఇంట్లో ఉంటున్నారు. అప్పటి నుంచి యువతికి వేదింపులు మొదలయ్యాయి. పెద్దలు చూసిన సంబంధం చేసుకుంటే.. కట్నం వచ్చేదని, తాను మరో పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడు నిత్యం ఆమెను వేదించేవాడు. ఈ విషయంలో పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఆ యువకుడు తన తల్లితో కలిసి మక్లూర్ మండలం రాంచంద్రపల్లి అటవీ ప్రాంతంలో రాధ తలపై బండరాయితో మోదీ హత్య చేశారు. ఆ తర్వాత నిప్పంటించి దహనం చేశారు.
అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. మృతి చెందింది నవీపేటలోని శివతండాకు చెందిన రాధగా గుర్తించారు. భర్త, అత్త కలిసి యువతిని దారుణంగా హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది.