ఘనంగా హీరో నితిన్-షాలినిల వివాహం
By తోట వంశీ కుమార్ Published on 27 July 2020 8:47 AM ISTటాలీవుడ్ హీరో నితిన్ ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలస్‌లో ఆదివారం రాత్రి నితిన్, షాలిని వివాహం ఘనంగా జరిగింది. కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా పెళ్లిని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య కుటుంబ సభ్యులు, సన్నిహితులు అతి ముఖ్యమైన వారు వివాహానికి హాజరయ్యారు. టాలీవుడ్ పెద్దలు, మిత్రులు నితిన్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆశీర్వదిస్తున్నారు.
నవ దంపతులు సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో ధగధగమెరిసిపోయారు. హిందూ సంప్రదాయం పద్దతిలో వేద పండితుల మంత్రాల నడుమ నిర్ణయించిన సుముహర్తానికే నితిన్ తన ప్రేయసి షాలిని మెడలో మూడు ముళ్లు వేశాడు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ కవిత, సినీ పరిశ్రమ నుంచి యంగ్ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కార్తికేయ తదితరులు నితిన్ వివాహ వేడుకకు హాజరయ్యారు.
వాస్తవానికి నితిన్ పెళ్లి పనులు ఫిబ్రవరిలో మొదలయ్యాయి. ఏప్రిల్ 16న వివాహాన్ని నిశ్చయించారు. కానీ కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌లలో వాయిదా పడింది. దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేసుకుంటే కరోనా వల్ల కుదరలేదు. వివాహం అనంతరం షాలినీ మెడలో తాళి కడుతున్న ఫొటోను షేర్ చేసిన నితిన్ ‘మొత్తానికి ఓ ఇంటివాడినయ్యా.. మీ దీవెనలు కావాలి’ ట్వీట్ చేశాడు.