నేడు మరోసారి మీడియా ముందుకు నిర్మలాసీతారామన్‌.. ఈ దఫా..

By Newsmeter.Network  Published on  14 May 2020 6:57 AM GMT
నేడు మరోసారి మీడియా ముందుకు నిర్మలాసీతారామన్‌.. ఈ దఫా..

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం మరోసారి మీడియా ముందుకు రానున్నారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. కాగా ఆ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను, కేటాయింపులను బుధవారం నిర్మలా సీతారామన్‌ వివరించారు. ఎంఎస్‌ఎంఈ, ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐ లాంటి ఫైనాన్సింగ్‌ కంపెనీలు ఎదుర్కొంటున్న ద్రవ్య సమస్యలను పరిష్కరించడానికి అనేక చర్యలను ఆవిష్కరించారు. కాగా నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ప్యాకేజీ సామాన్యులకు ఊరటనివ్వలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Also Read :హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో అగ్నిప్రమాదం

ఇప్పటికే మాజీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి, కాంగ్రెస్‌ నేత చిదంబరం ప్యాకేజీ కేటాయింపులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్యాకేజీలో వలస కూలీలకు వాటా లేకపోవడం దారుణం అని అన్నారు. నిర్మలా ఆర్థిక ప్యాకేజీ కేవలం పెద్ద ఎంఎస్‌ఎంఈ కోసమేనని చిదంబరం విమర్శించారు. దేశంలోని మొత్తం 6.3 కోట్ల ఎంఎస్‌ఎంఈల్లో 45 లక్షల ఎంఎస్‌ఎంఈలకు మాత్రమే నిర్మలా ప్యాకేజీ అనుకూలంగా ఉందన్నారు. చిదంబరంతో పాటు పలువురు నిర్మలా ప్యాకేజీ పై పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ గురువారం సాయంత్రం 4గంటలకు మరోసారి మీడియా ముందుకు వస్తుండటం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. ఈ మీడియా సమావేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన చర్యలను ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సప్లయ్‌ చెయిన్‌, అంతరాయాలు, సమస్యలను పరిష్కరించే మార్గాలను ఆర్థికమంత్రి సూచించనున్నారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4గంటలకు జరిగే మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్‌ ఏం చెబుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read :హైదరాబాద్‌ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు.. కానీ..!



Next Story