భారత ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరుతో 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. ప్యాకేజీ స్వయంసమృద్ది, ఆర్థిక నిర్మాణానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు బుధవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. స్వీయ ఆధారిత భారతం పేరుతో ప్రత్యేక ప్యాకేజీని వివిధ మంత్రిత్వశాఖలతో చర్చించిన తర్వాతే ప్యాకేజీకి రూపకల్పన చేసినట్లు చెప్పారు.

ఈ ప్యాకేజీ దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని అన్నారు. భారత్‌ స్వయం సమృద్దిగా ఎదగడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుందని, ఎకనామీ, మౌలికరంగం, టెక్నాలజీ, వనరులపై ఫోకస్‌ పెట్టనున్నట్లు చెప్పారు. 40 రోజుల్లో భారత్‌ శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు. స్వదేశీ బ్రాండ్లను తయారు చేయడమే ఈ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశమని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

చిన్న, మధ్య తరహా కంపెనీలకు రూ. 3 లక్షల కోట్లు కేటాయించామని, ఎంఎస్‌ఎంఈ రుణాలకు కేంద్రం గ్యారంటిగా ఉంటుందన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్టోబర్‌ వరకూ ఎంఎస్‌ఎంఈలకు ఈ రుణ సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. ఈ రుణాలకు నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుందని, ఏడాది మారటోరియం సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే రూ. 80వేల కోట్ల విలువైన రీఫండ్స్‌ చేశామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ఉత్పత్తులకు పేరు రావాలని, పీఎం కిసాన్‌ యోజన వంటి పథకాల ద్వారా రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు.

ఉజ్వల వంటి పథకాలతో ప్రజలకు మరింత చేరువయ్యామని అన్నారు. లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ వంటి సంస్కరణలను అర్థం చేసుకోవాలని, భూమి, కార్మికులు, నగదు లభ్యత, చట్టాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే పేదలు, వలస కార్మికుల ఖాతాల్లోకి నేరుగా నగదును జమ చేస్తామని వివరించారు. లాక్‌డౌన్‌ తర్వాత గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీని ప్రకటించామని, 41 కోట్ల జన్‌ధన్‌ ఖాతాల్లోకి రూ. 52,606 కోట్లను నేరుగా జమ చేశామమని ప్రకటించారు. 71వేల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేశామని, నగదు లభ్యత పెంచడమే మా ఉద్దేశమని పేర్కొన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *