బ్రేకింగ్‌: నిర్మల్‌ జిల్లాలో వలస కూలీల లారీ బోల్తా.. 49 మంది..

By సుభాష్  Published on  16 May 2020 3:09 AM GMT
బ్రేకింగ్‌: నిర్మల్‌ జిల్లాలో వలస కూలీల లారీ బోల్తా.. 49 మంది..

నిర్మల్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వలస కూలీలతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 49 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా కొండాపూర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మేడ్చల్‌ నుంచి వలస కూలీలు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 49 మంది ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులంతా ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

అయితే లాక్‌డౌన్‌ కారణంగా రోడ్డు ప్రమాదాల్లో వలస కూలీలు ఎందరో మృతి చెందుతున్నారు. తాజాగా శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 23 మంది కూలీలు దుర్మరణం చెందారు.

అలాగే మంగళవారం నాడు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మాచవరంలో కూలీలతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ విద్యుత్‌ స్తంభాన్నిఢీకొట్టింది. దీంతో విద్యుత్‌ తీగలు ట్రాక్టర్‌పై పడటంతో 10 కూలీలు మృతి చెందారు.

అలాగే ఇటీవల ఔరంగాబాద్‌లో రైలు పట్టాలపై నిద్రస్తున్న వలస కూలీల నుంచి గూడ్స్‌ రైలు దూసుకెళ్లడంతో 19 మంది మృతి చెందారు. ఇంకా వేర్వేరు ప్రమాదాల్లో ఎందరో వలస కూలీలు మృతి చెందిన ఘటనలు చూస్తుంటే మనసు కలచివేస్తోంది. ఇటీవల కేంద్రం లాక్‌డౌన్‌ నుంచి వలస కూలీలకు సడలింపులు ఇస్తూ స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఇదే వారికి శాపంగా మారింది.

Next Story