ఉరికి ముందు బోరున విలపించిన 'దోషి'

By సుభాష్  Published on  20 March 2020 6:09 AM IST
ఉరికి ముందు బోరున విలపించిన దోషి

2012 డిసెంబర్‌ 16న ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆరుగురిని అరెస్టు చేయగా, ఒకరు జైల్లో ఆత్మహత్య చేసుకున్నారు. మరో దోషి బాల నేరస్తుడిగా పరిగణించి మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించి విడుదల చేశారు. ఇక నలుగురు దోషులు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు తీహార్‌ జైల్లోనే ఉన్నారు. ఇప్పటికే దోషులకు ఊరిశిక్ష విధించగా, వివిధ పిటిషన్ల కారణంగా ఉరి శిక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఇక తాజాగా శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తీహార్‌ జైలులోని 3వ నెంబర్‌లో నలుగురు దోషులకు ఉరితీశారు. దోషులను ఉదయం 4 గంటలకే నిద్రలేపి అల్పహారం అందించారు. నలుగురికి ఒకే సారి ఉరి తీయడం దేశ చరిత్రలోనే తొలిసారి.

ఉరి కంబం వద్ద 48 సెక్యూరిటీ

కాగా, దోషులకు ఉరి తీసే సమయంలో ఉరికంబం దగ్గర 48 మంది సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఒక్కో దోషి వెంట 12 చొప్పున సిబ్బంది ఉన్నారు. ఉరితీసే ముందు దోషులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉరిశిక్షకు ముందు దోషిలో ఒకడైన వినయ్‌ శర్మ బోరున విలపించినట్లు తెలుస్తోంది. ఉరి నుంచి తప్పించుకునేందుకు దోషులు శతవిధాలుగా ప్రయత్నాలు చేసినా చివరకు వారి ప్రయత్నాలు ఫలించలేదు. వివిధ న్యాయస్థానాల్లో ఎన్నో రకాల పిటిషన్లు దాఖలు చేసి ఉరి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు అనే విషయం మరోసారి రుజువైంది. దోషులు ఉరి కంబానికి అరగంట పాటు వేలాడనున్నారు.

గురువారం అర్ధరాత్రి వరకు వాదనలు

నిర్భయ దోషుల ఉరితీతపై ఢిల్లీ హైకోర్టులో దోషుల పిటిషన్లపై గురువారం అర్ధరాత్రి వరకు వాడీవేడిగా వాదనలు జరిగాయి. దోషుల తరపున పిటిషనర్‌ సమర్పించిన పత్రాలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషన్‌లో అనెక్జర్‌, అఫిడవిట్‌, మెమోలు లేవని అసహనం వ్యక్తం చేసింది. అయితే కరోనా వైరస్‌ కారణంగా కోర్టులో జిరాక్స్‌ యంత్రాలు కూడా పని చేయడం లేదని దోషుల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ రోజు కోర్టులు తిరిగారని, ఫోటో కాపీ యంత్రాలు పని చేయడం లేదని కట్టుకథలు చెప్పవద్దని జడ్జి వ్యాఖ్యనించారు. దోషులకు న్యాపరమైన అవకాశాలు ఇంకా ఉన్నాయని, అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్‌ పెండింగ్‌లోఉందని, అలాంటి సమయంలో దోషులను ఎలా ఉరితీస్తారంటూ న్యాయవాది ఏపీ సింగ్‌ కోర్టును ప్రశ్నించాడు. ఇలా గురువారం అర్ధరాత్రి వరకు సాగిన వాదనలు.. చివరకు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.

Next Story