నిర్భయ దోషుల కథ ముగియనుంది. దోషుల ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ తొలగిపోయింది. ఉరిశిక్షపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పటియాల హౌస్‌ కోర్టు నిరాకరించింది. దీంతో రేపు నలుగురు దోషులకు రేపు ఉదయం 6 గంటలకు తీహార్ జైల్లో ఉరిశిక్ష వేయనున్నారు. వీరికి కోర్టు ఇది వరకే రెండు సార్లు ఉరిశిక్షను అమలు చేయగా, దోషులు రాష్ట్రపతికి పిటిషన్లు దరఖాస్తు చేసుకోవడం వల్ల వాయిదా పడింది. తర్వాత ఇటీవల మార్చి 3వ తేదీని ఉరిశిక్షను అమలు చేస్తూ ఢిల్లీ పటియాల కోర్టు స్పష్టం చేసింది. అయినా దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్త ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు నాటకాలాడాడు. దోషి పవన్‌ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు.

అలాగే ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని పవన్‌ గుప్తా.. సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు బెంచ్‌ ప్రత్యేకంగా సోమవారం విచారణ చేపట్టింది. పవన్‌ పిటిషన్‌పై జస్టిస్‌ రమణ, అరుణ్‌ మిశ్రా, ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, భానుమతి, అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు వినిపించింది. పిటిషన్‌లో విచారించాల్సిన అంశాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా ఇప్పటి వరకు నిందితుల్లో ముగ్గురు న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు. తాజాగా పవన్‌ గుప్తా కూడా తన క్యూరేటివ్‌ పిటిషన్‌ను వినియోగించుకున్నాడు.

ఉరి నుంచి తప్పించుకునేందుకు నిర్భయ దోషులు గత కొన్ని రోజుల డ్రామాలు ఆడుతున్నారు. పిటిషన్లు వేస్తూ కాలయాపన సాగిస్తున్నారు. ఉరికి ముందు ఆరోగ్యంగా ఉండాలన్న నిబంధనను తోసిపుచ్చి గాయాలు చేసుకుంటూ, అనారోగ్యానికి గురవుతున్నారు. దోషులు ఇప్పటికీ ఉరిని వాయిదా వేసేలా పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. దోషులు ఇప్పటి వరకూ తమ ముందున్న న్యాయ అవకాశాలను ఉపయోగించుకొని రెండు సార్లు ఉరి వాయిదా పడేలా చేశారు. ఇటీవల తీహార్‌ జైల్లో వినయ్‌ శర్మ ఆత్మహత్యకు యత్నించాడు. తనను ఉంచిన సెల్‌లో గోడకు వినయ్‌ తలబాదుకొని గాయపరుచుకున్నాడు. ఇక ఈ రోజు విచారణ చేపట్టిన పటియాల హౌస్‌ కోర్టు చివరకు నలుగురు దోషులకు ఉరివేయాల్సిందేనంటూ స్పష్టం చేసింది. మార్చి 3న ఉదయం 6 గంటలకు అమలు చేసిన ఉరిశిక్షను తప్పకుండా అమలు కావాలని తేల్చి చెప్పింది.

కాగా, 2012, డిసెంబర్‌ 16న ఓ విద్యార్థిపై కదులుతున్నబస్సులు ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను, ఆమె స్నేహితుడిని రోడ్డుపై విసిరేసి పరారయ్యారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను సింగపూర్‌ లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా, చివరకు కన్నుమూసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెకు నిర్భయగా నామకరణం చేశారు.

ఈ ఘటనలో నిందితులైన, వినయ్‌, రామ్‌ సింగ్‌, అక్షయ్‌కుమార్‌, పవన్‌, ముఖేష్‌, మరో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని తీహార్‌ జైలుకు తరలించగా, 2013లో ఓ నిందితుడు జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో నిందితుడు మైనర్‌గా భావించి మూడు సంతవ్సరాల పాటు జైలు శిక్ష విధించి విడుదల చేశారు. కేసు విచారించిన కోర్టు, కాగా మిగిలిన నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.