ముహూర్తం: ఫిబ్రవరి 1వ తేదీ.. ఉదయం 6 గంటలకు..
By సుభాష్ Published on 17 Jan 2020 5:44 PM ISTనిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురిని తీహార్ జైలులోని ఉరివేసే 3వ నెంబర్ జైలుకు తరలించారు. నలుగురు దోషులైన అక్షయ్ కుమార్, పవన్ గుప్త, ముఖేష్‌సింగ్, వినయ్ లను మొదటిసారిగా ఉరిశిక్ష జరిగే జైలు నంబర్ 3కు తరలించారు. వీరికి 22న ఉరిశిక్ష వేయాల్సిఉండగా, దోషి ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ కారణంగా అది వాయిదా పడింది. దీంతో రాష్ట్రపతి ఆ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు నలుగురికి ఉరిశిక్ష వేయాలని తాజాగా కోర్టు వెల్లడించింది. ఈ నలుగురిని కూడా వేర్వేను సెల్స్ లో ఉంచి సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆసియాలోనే అతి పెద్ద జైలు అయిన తీహార్ జైలులో ఈ నలుగురిని ఉరి వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నలుగురు దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ పెద్దకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించిన విషయం తెలిసిందే.
దోషి ముఖేష్‌సింగ్ క్షమాభిక్ష దరఖాస్తును ఒకవేళ రాష్ట్రపతి తిరస్కరించినా.. దోషులకు కనీసం 14 రోజులు గడువు ఇవ్వాలన్న నిబంధన ఉండటంతో ఈనెల 22న ఉరి శిక్ష అమలు సాధ్యం కాదని ఢిల్లీ సర్కార్, తీహార్ జైలు అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో వచ్చే నెల 1వ తేదీన నలుగురికి ఉరిశిక్ష వేయనున్నట్లు కోర్టు వెల్లడించింది.
తీహార్ జైలు వద్ద భారీ బందోబస్తు
నిర్భయ దోషులను ఉరితీసేందుకు తేదీ దగ్గర పడుతుండటంతో తీహార్ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీ పటియాల కోర్టు ముందుగా ఈనెల 22న ఉరిశిక్షకు తేదీ ఖరారు చేయగా, అందులో ఓ దోషి క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి పటిషన్ పెట్టుకోవడంతో ఈ తేదీని వాయిదా పడింది. దోషుల్లో ఒకరు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో ఆ పిటిషన్‌పై ఏదో ఒకటి తేలే వరకు ఆ క్షమాభిక్ష పిటిషన్‌ను కూడా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇప్పటికే నలుగురు దోషుల జైలు గదుల వద్ద హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. జైలు గార్డుల పర్యవేక్షణలో ఈ నలుగురు దోషులను వేర్వేరు సెల్స్ లో ఉంచారు. సాధారణంగా జైలు నిబంధనల ప్రకారం.. ఇతర ఖైదీల మాదిరిగానే నిర్భయ దోషులు వారానికి రెండు సార్లు వారి వారి కుటుంబీకులను కలిసే అవకాశం ఉంది. కానీ ఈ నలుగురు దోషులకు కోర్టు డెత్ వారంట్ జారీ చేయడంతో వారు చివరి సారిగా కుటుంబ సభ్యులను కలిసేందుకు తీహార్ జైలు అధికారులు అనుమతి ఇవ్వనున్నారు. నిర్భయ కేసులో దోషులైన నలుగురు మామూలుగానే ప్రవర్తిస్తున్నారని జైలు అధికారులు చెబుతున్నారు. ఉరిశిక్ష తేదీకి ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ సెంట్రల్ జైలు తలారీ పవన్ కుమార్ తీహార్ జైలును సందర్శించి ఉరి ఏర్పాట్లను పరిశీలించనున్నారు
ఢిల్లీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిన ధర్మాసనం
ఒక వైపు నలుగురు దోషులకు ఉరివేసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా, అందులో ఒక దోషి ముఖేష్‌సింగ్ పెట్టుకున్నక్షమాభిక్ష పిటిషన్ వల్ల ఉరిశిక్ష వాయిదా పడిందని, ఈ శిక్షతేదీని వాయిదా వేయాలని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ కారణంగానే ఉరిశిక్షను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. కేసులో ఒకరికంటే ఎక్కవ మంది దోషులున్నప్పుడు, అందులో ఒకరు క్షమాభిక్ష కోసం దరఖాస్తు పెట్టుకున్న సమయంలో అది ఏదో ఒకటి తేలే వరకు వారికి శిక్షను అమలు చేయరాదని జైలు నిబంధనలను చెబుతున్నాయని ఢిల్లీ ప్రభుత్వం గుర్తు చేసింది. ఉరిశిక్ష వాయిదా అంశంపై ఢిల్లీ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. ఉరిశిక్షను సవాలు చేస్తూ దోషి ముఖేష్ అభ్యర్థనపై విచారణ చేపట్టడానికి న్యాయం స్థానం తిరస్కరించింది. దిగువ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులో ఏ తప్పులేదని, అయినా దానిని తమ ముందే సవాల్ చేయడమంటే ఒక న్యాయస్థానంపై మరో న్యాయస్థానంలో ఆడుకోవడమేనని వ్యాఖ్యనించింది.