నా ఆయుష్షు తగ్గిపోతోంది.. ఉరిశిక్ష వ‌ద్దు: నిర్భ‌య నిందితుడి రివ్యూ పిటిష‌న్‌

By సుభాష్  Published on  10 Dec 2019 1:49 PM GMT
నా ఆయుష్షు తగ్గిపోతోంది.. ఉరిశిక్ష వ‌ద్దు: నిర్భ‌య నిందితుడి రివ్యూ పిటిష‌న్‌

ముఖ్యాంశాలు

  • త‌న‌కు ఉరిశిక్ష వ‌ద్దంటూ నిర్భ‌య నిందితుడు రివ్యూ పిటిష‌న్‌

ఢిల్లీలో నిర్భయ ఘ‌ట‌న‌పై దోషుల‌కు ఉరిశిక్ష ఖ‌రారైంది. ఈ మేర‌కు వారిని డిసెంబ‌ర్ 16న ఉరితీసేందుకు తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో దోషుల్లో ఒకరైన అక్షయ్ కుమార్ సింగ్ తీర్పును సమీక్షించాలంటూ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. 2012 నాటి నిర్భయపై సామూహికంగా అత్యాచారం జ‌రిపిన నిందితుల‌కు ఉరిశిక్ష విధిస్తూ... 2017లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని పిటిష‌న్‌లో కోరారు. ఈ కేసులో మిగతా ముగ్గురు దోషులు రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా, 2018 జూలై 9న సుప్రీం కోర్టు వాటిని తిరస్కరించింది.

గతంలో రివ్యూ పిటిషన్ వేసిన దోషి అక్షయ్ కుమార్ తరఫున లాయర్ ఏపీ సింగ్ మంగళవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖ‌లు చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యం, జల కాలుష్యం కారణంగా ఎలాగో నా ఆయుష్షు తగ్గిపోతోంది...కాబట్టి తనకు మరణశిక్ష విధించ‌వ‌ద్ద‌ని నిందితుడు అక్షయ్ సుప్రీం కోర్టును కోరడం గమనార్హం. ఢిల్లీ వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వాలను మందలిస్తూ.. సుప్రీం కోర్టు గతంలో చేసిన ఘాటైన వ్యాఖ్యల నేపథ్యంలో.. నిర్భయ దోషి.. వాయు కాలుష్యం ప్రస్తావన తీసుకురావ‌డం కొస‌మెరుపు. దోషి అక్ష‌య్ కుమార్ త‌న‌కు మ‌ర‌ణ శిక్ష వ‌ద్దంటూ ఢిల్లీ వాయు కాలుష్య కార‌ణాల‌ను పిటిష‌న్‌లో ప్ర‌స్తావ‌న‌కు తీసుకురావ‌డంపై అధికారులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. త‌న‌కు విధించిన‌ ఉరి శిక్ష‌ను ఎలాగోలా నిలిపివేయాల‌నే సాకుతో ఇలాంటి పొంత‌న‌లేని కార‌ణాలు చూపుతూ.. విలువైన కోర్టు స‌మ‌యాన్ని వృథా చేస్తున్నారంటూ అధికారులు మండిప‌డుతున్నారు.

2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి సమయంలో 23 ఏళ్ల ఓ విద్యార్థినిని దక్షిణ ఢిల్లీలో ఆరుగురు వ్యక్తులు కదులుతున్న బస్సులో సామూహికంగా అత్యాచారానికి పాల్ప‌డ్డారు. మాన‌వ మృగాలు పాల్ప‌డిన ఈ నీచ‌మైన ప‌నికి ఆమె తీవ్ర న‌ర‌కం అనుభ‌వించింది. తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఆమెను సింగపూర్‌లోని ఎలిజబెత్ హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ అదే నెల 29న ప్రాణాలు వ‌దిలింది. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసి దోషులుగా తేల్చారు పోలీసులు. నిందితుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ కేసులో దోషిగా తేలిన మ‌రో నిందితుడు మైనర్‌గా గుర్తించి మూడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. కాగా, ముకేశ్ (30), పవన్ గుప్తా (23), వినయ్ శర్మ (34), అక్షయ్ కుమార్ (31)ల‌కు ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వ‌గా, ఆ తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. తమను ఉరితీయొద్దంటూ ముగ్గురు దోషులు గతంలో సుప్రీంను కోరగా.. అత్యున్నత న్యాయస్థానం వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నేప‌థ్యంలో నిందితుల్లో ఒక‌రు క్ష‌మాభిక్ష పిటిష‌న్ పెట్టుకోగా, అందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం, గ‌వ‌ర్న‌ర్ తిర‌స్క‌రిస్తూ, రాష్ట్ర‌ప‌తికి పంపించారు. ఈ నేప‌థ్యంలో ఇలాంటి రేపిస్టుల‌కు క్ష‌మాభిక్ష పెట్టే అవ‌స‌రం లేద‌ని ఇటీవ‌ల రాష్ట్ర‌ప‌తి రాంనాథ్ కోవింద్ వ్యాఖ్య‌నించిన విష‌యం తెలిసిందే. ఇక గ‌తంలో ఉరి శిక్ష‌ను తెర‌పైకి తీసుకువ‌చ్చిన సుప్రీం కోర్టు, దోషుల‌ను ఉరి తీసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాల‌ని తీహ‌ర్ జైలు అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈనెల 16న నిందితుల‌ను ఉరితీయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక వారి ఉరి తీసేందుకు ఉరితాళ్ల‌ను త‌యారు చేసే బాధ్య‌త బీహార్‌లోని బ‌క్స‌ర్ జైలు ఖైదీల‌కు అప్ప‌గించిన‌ట్లు ఆ జైలు అధికారుల ద్వారా స‌మాచారం. ఈనెల 14 వ‌ర‌కు ఉరితాళ్లు సిద్ధం చేయాల‌ని జైలు అధికారుల‌కు ఆదేశాలు కూడా అందిన‌ట్లు తెలుస్తోంది. అప్ప‌ట్లో అప్జ‌ల్‌గురుకు ఉరి తాళ్ల‌ను త‌యారు చేసిన ఈ జైలు ఖైదీలే , ఇప్పుడు నిర్భ‌య నిందితుల‌కు కూడా ఉరితాళ్ల‌ను వీరే త‌యారు చేస్తున్నారు.

Next Story