నిమ్మగడ్డ ఎపిసోడ్ లో చివరకు మిగిలింది ఇదేనా?
By సుభాష్ Published on 31 July 2020 9:55 AM ISTప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు విశేష అధికారాలు ఉంటాయి. అదే సమయంలో వాటికి సైతం పరిమితులు ఉంటాయన్న విషయాన్ని జగన్ గుర్తించకపోవటమే పెద్ద సమస్యగా చెప్పాలి. ఏపీ ఎన్నికల్లో తాను సాధించిన చారిత్రక విజయాన్ని జగన్ తప్పుగా అర్థం చేసుకున్నారా? అన్న సందేహం కలుగక మానదు.
ప్రతి ప్రజా ప్రభుత్వానికి తమదైన ఎజెండా ఉండటం తప్పేం కాదు. అదేదీ రాజ్యాంగబద్ధంగా ఉండాలే కానీ.. రాజ్యాంగం తనకు కల్పించిన అధికారాలతో రూల్ బుక్ ను తనకు తగినట్లుగా మార్చేద్దామన్న పట్టుదల ఉండకూడదు.
ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను పునర్నియమిస్తూ ఏపీ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోవటం.. అధికారికంగా అర్థరాత్రి వేళ జీవోను విడుదల చేయటం తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్ ను నిశితంగా చూస్తే.. తన సహజలక్షణాలన్నింటిని జగన్ ప్రదర్శించారని చెప్పాలి. న్యాయస్థానాలు తనకు మొట్టికాయలు వేసినా.. వెనక్కి తగ్గకుండా.. ఏ స్థాయి వరకు వెళ్లాలో ఆ స్థాయి వరకు వెళ్లేందుకు ఏ మాత్రం మొహమాటపడని ఆయన.. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఒక అడుగు వెనక్కి వేసినా సరిపోయేది. సుప్రీం చెప్పిన తర్వాత కూడా వెనక్కి తగ్గని ఆయన తీరు విస్మయానికి గురి చేసింది.
నిమ్మగడ్డ ఎపిసోడ్ లో జగన్ వీరాభిమానులు కొందరు అత్యుత్సాహంతో కోర్టులోని న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వైనం సుప్రీంకోర్టు ముందుకు రావటం.. దాని సంగతేమిటో తమకు చెప్పాలనటమే కాదు.. దానికి ముహుర్తం పెట్టటంతో జగన్ సర్కారు ఇరుకున పడినట్లైంది.నిమ్మగడ్డ ఎపిసోడ్ కు సంబంధించి తాము జారీ చేసిన ఆదేశాల్ని అమలు చేసే విషయంలో జరుగుతున్న జాప్యంపై ఇప్పటికే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. అయినప్పటికి వెనక్కి తగ్గని జగన్ సర్కారు.. సుప్రీంలో కేసు విచారణకు డేట్ దగ్గరపడుతున్న వేళ.. తప్పనిసరి పరిస్థితుల్లో వెనకడుగు వేయాల్సిన పరిస్థితి. ఏ జీవోతో అయితే నిమ్మగడ్డ పదవీకాలానికి కత్తెర వేశారో.. ఇప్పుడు అలాంటి మరో జీవోతో ఆయన్ను ఏపీ ఎన్నికల కమిషనర్ గా పునర్నియమిస్తూ ఆదేశాల్ని జారీ చేసింది. దీంతో.. జగన్ తీరుపై న్యాయపోరాటం చేసి విజయం సాధించిన వ్యక్తిగా నిమ్మగడ్డ నిలిచిపోతే.. అవసరం లేని ఆవేశాలకు పోతే చివరకు మిగిలేదేమిటో జగన్ కు అర్థమయ్యే పరిస్థితి. తాను కస్సుమనటమే కాదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మగడ్డకు అవకాశం ఇచ్చేందుకు ససేమిరా అన్న జగన్ ఇప్పుడు అదే వ్యక్తిని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమించాల్సిన పరిస్థితి. తనకేమాత్రం ఇష్టం లేని వ్యక్తి చేతిలో కీలక అధికారం ఉండటం ఆయనకు ఇబ్బందికరమే.